శ్రీదేవి చనిపోయి 20 రోజులైనా ఇప్పటికీ తెలుగులో ఒక్కరు కూడా సంతాప సభ ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు ఇదే అందర్నీ ఆలోచింపచేస్తున్న విషయం. ఇప్పటికే ముంబైలో శ్రీదేవి సంతాపసభ ఏర్పాటు చేసారు. అక్కడ ప్రతీ స్టార్ హీరో కూడా వచ్చి శ్రీదేవికి నివాళి అర్పించారు. కుటుంబం కూడా అంతా వచ్చి అతిలోకసుందరిని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి కొన్నేళ్ల నుంచి ముంబైలోనే ఉంది.. కాబట్టి అక్కడి వాళ్లు సంతాప సభ ఏర్పాటు చేసారు అనుకోవచ్చు. కానీ నిన్నగాక మొన్న మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీ కూడా శ్రీదేవి సంతాప సభ ఏర్పాటు చేసారు. అజిత్, కమల్ హాసన్ లాంటి సూపర్ స్టార్స్ కూడా ఈ సభకు వచ్చారు. శ్రీదేవితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి తమిళనాట ఎన్ని సినిమాలు చేసిందో.. తెలుగులో కూడా అన్నే చేసింది.
ఆమె పుట్టింది మాత్రం అక్కడే. అందుకే ఈమెను ఇక్కడ పట్టించుకోవడం లేదా..? అదీ కాదంటే మనని వదిలేసి వెళ్లిన హీరోయిన్ కు ఇక్కడ సంతాప సభ ఎందుకు అనుకుంటున్నారా..? ఆ లెక్కన తమిళ వాళ్లు కూడా ఇదే అనుకోవాలి కదా..? మరి వాళ్లెందుకు ఏర్పాటు చేసారు ఓ సంతాప సభ. అంటే మనవాళ్లు కనీసం ఓ సంతాప సభ ఏర్పాటు చేయడానికి కూడా సమయం లేదనుకోవాలా..? ఆ మధ్య తెలుగులో సుబ్బిరామిరెడ్డి ప్రత్యేకంగా శ్రీదేవి సంతాపసభ ఏర్పాటు చేసారు కానీ అది ఇండస్ట్రీ తరఫు నుంచి కాదు. శ్రీదేవి బతికున్నపుడు తనకు తెలుగు పుట్టినిల్లు అని చెప్పుకుంది. ఇప్పుడు అత్తవారిల్లు బాగానే మర్యాద చేసింది కానీ పుట్టిల్లే ఈమెను పట్టించుకోవడం లేదు. మరి ఆ రోజు ఎప్పుడొస్తుందో మనోళ్లకే తెలియాలి.