ఎందుకో తెలియదు కానీ తెలుగులో మిక్కీ జే మేయర్ ను ఎప్పుడూ తక్కువ అంచనా వేస్తుంటారు మన దర్శక నిర్మాతలు. ఈయనకు అవకాశం ఇచ్చినప్పుడల్లా తనను తాను నిరూపించుకుంటూనే ఉన్నాడు. ఈ మధ్యే వచ్చిన మహానటి అంత పెద్ద విజయం సాధించడానికి మిక్కీ జే మేయర్ సంగీతం కూడా కీలకమే. ఇక ఇప్పుడు కూడా శ్రీనివాస కళ్యాణంతో మరోసారి తన పాటల పవర్ చూపిస్తున్నాడు ఈ సంగీత దర్శకుడు.
శతమానం భవతికి మరుపురాని పాటలు ఇచ్చిన ఈ కుర్ర సంగీత తరంగం.. ఇప్పుడు శ్రీనివాస కళ్యాణంలోనూ ఇదే కొనసాగించాడు. ఈ సారి కూడా ట్యూన్స్ తో మైమరిపిస్తున్నాడు. ముఖ్యంగా ఇప్పటికే కళ్యాణం వైభోగం అంటూ సాగే టైటిల్ సాంగ్ చార్ట్ బస్టర్ అయిపోయింది. ఇకపై ప్రతీ తెలుగింటి పెళ్లిలో ఇదే పాట వినిపించినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇప్పుడు విడుదలైన మిగిలిన పాటలకు కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. ఇతడేనా ఇతడేనా పాట చిలిపిగా ఉంటే..
ఎక్కడ నువ్వుంటే, మొదలెడదాం లాంటి పాటలు ప్రేక్షకులకు ప్రేమను పంచుతున్నాయి. ఇక సతీష్ వేగేశ్న స్టైల్ లో వినవమ్మా తూరుపు చుక్క పాట ఉంది. శతమానం భవతిలో మెల్లగా తెల్లారిందో అలా పాటను గుర్తు తెస్తుంది ఇది. ఆడియో మొత్తం వినసొంపుగా సాగింది. ఆగస్ట్ 9న శ్రీనివాస కళ్యాణం విడుదల కానుంది. దిల్ రాజు ఈ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. నితిన్ కు కూడా ఈ చిత్ర ఫలితం కీలకమే.