ఇలాంటి గ్యారేజ్ ఎవరైనా ఓపెన్ చేస్తారా అసలు.. కానీ శర్వానంద్ చేసాడు. ఆయన ఏరికోరి ఫ్లాప్ దర్శకులనే సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఏ ఒక్కరో ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు కానీ కొన్నేళ్లుగా శర్వానంద్ చేస్తోన్న దర్శకులంతా వాళ్లే. వాళ్లతోనే సినిమాలు చేస్తూ హిట్లు కొడుతున్నాడు ఈ హీరో. కావాలంటే 2017నే తీసుకోండి. గతేడాది ఈయన రెండు విజయాలు అందుకున్నాడు. అందులో శతమానం భవతి బ్లాక్ బస్టర్.
దానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. ఈయన ముందు సినిమా దొంగలబండి ఎప్పుడొచ్చి ఎప్పుడు వెళ్లిపోయిందో కూడా తెలియదు. ఆయన్ని నమ్మి ఆఫర్ ఇచ్చాడు హిట్ కొట్టాడు. ఇక మారుతి కూడా అంతే. బాబుబంగారం తర్వాత మహానుభావుడు చేసాడు.. అది హిట్. ఇప్పుడు హను రాఘవపూడితో పడిపడి లేచే మనసు అంటున్నాడు. ఈయన ముందు సినిమా లై డిజాస్టర్. సుధీర్ వర్మ ముందు సినిమా కేశవ యావరేజ్..
ఇప్పుడు ఈయనతో సినిమా చేస్తున్నాడు. ఇవన్నీ ఇలా ఉండగానే ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాలతో శర్వానంద్ సినిమా చేయబోతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఈ దర్శకుడి ముందు సినిమా బ్రహ్మోత్సవం డిజాస్టర్. మహేశ్ లాంటి స్టార్ హీరోను పెట్టుకుని సీరియస్ గా సీరియల్ తీసాడని విమర్శలు వచ్చాయి శ్రీకాంత్ అడ్డాలపై. రెండేళ్లుగా కనిపించని శ్రీకాంత్.. ఇప్పుడు తన కథతో శర్వాను ఒప్పించాడని తెలుస్తుంది.
మొత్తానికి శర్వా గ్యారేజ్ ఒకటి ఓపెన్ చేసుకుని.. అక్కడ ఫ్లాప్ దర్శకులు కావలెను అని బోర్డ్ ఒకటి పెట్టుకున్నాడు శర్వానంద్. మరి ఈయన నమ్మకాన్ని వీళ్లంతా నిలబెడతారో లేదో చూడాలిక..!