నిండా 35 ఏళ్లు కూడా లేవు.. అప్పుడే నటన నుంచి ఆయన రిటైర్మెంట్ తీసుకున్నాడు. పట్టుమని పది సినిమాలు కూడా చేయకముందే యాక్టింగ్ ఇంక చాలనుకుంటున్నాడు. అతడే రాహుల్ రవీంద్రన్. సింగర్ చిన్మయి భర్త ఈయన. తెలుగులో అందాల రాక్షసి సినిమాతో పరిచయం అయ్యాడు. ఆ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలు చేసినా కూడా ఈయనకు పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. దాంతో నటన కాదని దర్శకత్వం వైపు వచ్చాడు ఈ కుర్రహీరో. ఈయన సుశాంత్ తో చిలసౌ సినిమా చేసాడు. నటులుగా ఇండస్ట్రీకి వచ్చి దర్శకులుగా మారడం ఈ మధ్య ట్రెండ్ అయిపోయింది. నటుడిగా ఇండస్ట్రీకి వచ్చినపుడు.. ఆయన కేవలం నటుడుగానే ఉంటాడు. కానీ అందులో కొందరికి మాత్రం దర్శకుడిగా మారాలనే కోరిక ఉంటుంది. ఈ మధ్య కాలంలో వెంకీ అట్లూరి అలా అయినవాడే. ఈ కుర్రాడు స్నేహగీతం సినిమాలో హీరోగా నటించాడు. కానీ తన పాత్ అది కాదు.. దర్శకుడిగా మారాలనేది ఆయన కోరిక. అనుకున్నట్లుగానే దర్శకుడై తొలిప్రేమతో హిట్ కొట్టాడు.
ఇప్పుడు ఇదే దారిలో రాహుల్ రవీంద్రన్ కూడా వెళ్తున్నాడు. అక్కినేని మేనల్లుడు సుశాంత్ హీరోగా చిలసౌ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రం మొదలైన పుడు ఎవరూ పట్టించుకోలేదు కానీ టీజర్ విడుదలైన తర్వాత మాత్రం కచ్చితంగా ఆసక్తి రేపింది. పెళ్లి చేసుకోవాలంటూ ఇంట్లో పెట్టే టార్చర్ ను ఫన్నీగా ఈ చిత్రంలో చూపించబోతున్నాడు రాహుల్. ఈ చిత్రం విడుదలకు ముందే మరో సినిమాకు కూడా ఈయన చేతుల్లోకి వచ్చినట్లు తెలుస్తుంది. చిలసౌ తెరకెక్కించిన తీరు నచ్చి నాగార్జున ఆఫర్ ఇచ్చాడని.. రెండో సినిమా ఈయనతోనే చేయబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా అన్నపూర్ణ బ్యానర్ లో రాహుల్-నాగార్జున సినిమా ఉండబోతుంది. ప్రస్తుతం ఈయన తెరకెక్కిస్తోన్న చిలసౌ కూడా అన్నపూర్ణ స్టూడియోస్ విడుదల చేస్తుంది.