బాగున్న వాడిని ఎలా ఉన్నావ్ అని అడగటం అనవసరం.. బాధల్లో ఉన్న వాడిని బాగున్నావా అని అడగడం అవివేకం.. అని ఆ మధ్య ఓ చిత్రంలో త్రివిక్రమ్ డైలాగ్ రాసాడు. ఈ రెండు మాటలు ఇప్పుడు సాయిధరంతేజ్ కెరీర్ కు బాగా సూట్ అవుతాయి. ఒకప్పుడు బాగున్నాడు కాబట్టి ఎవరూ ఈయన్ని బాగున్నావా అని అడగలేదు. కానీ ఇప్పుడు బాగున్నావా అని అడిగితే అంతకంటే దారుణం మరోటి ఉండదు. ఎందుకంటే ఒకటి రెండు కాదు.. ఏకంగా వరసగా ఐదు డిజాస్టర్లు ఇచ్చాడు సాయిధరంతేజ్. మెగా మేనల్లుడు అనే బ్రాండ్ ఉన్నా దాన్ని వాడుకోవడంలో దారుణంగా ఫెయిల్ అవుతున్నాడు సాయి.
ఇండస్ట్రీకి ఎలా వచ్చాడు.. ఎలా ఎదుగుతాడు అనుకున్నవాడు.. ఇప్పుడు ఎలా మారిపోతున్నాడు.. అసలు తప్పెక్కడ జరుగుతుంది..? సాయి విషయంలో ఏం జరుగుతుంది..? ఎందుకు ఈయన్ని ఇంతగా ఫ్లాపులు వెంటాడుతున్నాయి..? నిజంగానే మెగా మేనల్లుడికి కథల ఎంపిక సాధ్యం కావడం లేదా.. లేదంటే బ్రాండ్ మాత్రమే చూసి కథలు అస్సలు పట్టించుకోవడం లేదా..? అసలు సాయిధరం తన దగ్గరికి దర్శకులు వచ్చినపుడు కథలు వింటున్నాడా..? ఇన్నాళ్లూ ఎక్కడో చిన్నగా ఉన్న ఈ అనుమానం.. ఇంటిలిజెంట్ డిజాస్టర్ తో మెయిన్ ట్రాక్ లోకి వచ్చింది. అసలు ఈయన నిజంగా కథలు వింటున్నాడా లేదంటే దర్శకుల్ని నమ్మేస్తున్నాడా అనిపిస్తుంది. ఇంటిలిజెంట్ లో ఏం కథ ఉందని వినాయక్ కు ఓకే చెప్పాడో మరి..? ఒక్క వినాయక్ అనే బ్రాండ్ తప్ప.
ఒక్కటి రెండు అంటే ఏమో అనుకోవచ్చు కానీ మరీ వరసగా ఐదు ఫ్లాపులు అంటే సాయి కెరీర్ ఎంత డేంజర్ జోన్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు కెరీర్ పై దృష్టి పెట్టకపోతే కచ్చితంగా మెగా మేనల్లుడి కెరీర్ మరింత దారణంగా పడిపోవడం ఖాయం. తిక్క సినిమా నుంచే సాయి కెరీర్ కు తిక్క మొదలైంది.. ఆ తర్వాత వచ్చిన విన్నర్.. నక్షత్రం.. జవాన్ కూడా డిజాస్టర్లుగా మారాయి. ఇప్పుడు ఇంటిలిజెంట్ అన్నింటికంటే పెద్ద డిజాస్టర్ అయి కూర్చుంది. ఈ చిత్రానికి కనీస ఓపెనింగ్స్ కూడా రాలేదు. వినాయక్ బ్రాండ్ కూడా సినిమాకు హెల్ప్ కావట్లేదు. అసలు ఇలాంటి కథలు ఎందుకు చేస్తున్నారో అంటూ విమర్శలు కూడా వస్తున్నాయి సాయిపై. ప్రస్తుతం కరుణాకరణ్ తో ఓ ప్రేమకథ.. గోపీచంద్ మలినేనితో ఓ సినిమా.. చంద్రశేఖర్ యేలేటితో మరో సినిమాకు కమిటయ్యాడు సాయి. మరి చూడాలిక.. ఈ సినిమాలైనా మేనల్లున్ని గట్టెక్కిస్తాయో లేదో..?