సుకుమార్ అంటే తెలుగులో ఓ ఇమేజ్ ఉంది.. ఆయన సినిమాలంటే ఓ అంచనా ఉంది.. ఇలా చేస్తాడు.. ఇలాంటి సినిమాలే చేస్తాడనే పేరుంది. ఇంకా చెప్పాలంటే సుకుమార్ అంటే సాధారణ ప్రేక్షకులకు అర్థం కాదు.. కాస్త లెక్కలు తెలిసి మైండ్ బాగా పని చేస్తుంటే తప్ప ఆయన సినిమా అర్థం చేసుకోలేం అనే అంచనా ఉంది. సినిమాలు చూడ్డానికి వెళ్లేది ఎంజాయ్ చేయడానికి కానీ బుర్రలకు పదును పెట్టుకోడానికి కాదు కదా..
ఈ విషయం కాస్త ఆలస్యంగా అర్థమైంది ఈ దర్శకుడికి. ఈయన తెరకెక్కించిన నేనొక్కడినే గానీ నాన్నకు ప్రేమతో కానీ సినిమాలకు టాక్ బాగానే వచ్చింది. కానీ రీచ్ అయింది మాత్రం చాలా తక్కువ మందికే. అందుకే సినిమాలు ప్రశంసల దగ్గరే ఆగిపోయాయి. సినిమాలు ఫ్లాప్ అయినా కూడా ఈయన టేకింగ్ కు ఫిదా అయిపోయి మళ్లీ మళ్లీ ఆపర్లు ఇస్తుంటారు స్టార్ హీరోలు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా ఇదే చేసాడు. రంగస్థలంతో ఆఫర్ ఇచ్చినపుడు చరణ్ రిస్క్ చేస్తున్నాడా అనుకున్నారంతా..?
ఎప్పుడూ అర్థం కాని సినిమాలు చేసే ఈ దర్శకుడు.. రంగస్థలంకు మాత్రం అరటి పండు వలిచి నోట్లో పెట్టినంత సులభంగా.. స్పష్టంగా కథ చెప్పాడు. ఇదే అందరికీ షాక్ అనుకుంటే.. ఊహించిన రేంజ్ లో ఎమోషన్స్ పండించాడు ఈ దర్శకుడు. అసలు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు చూసి ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సాధారణ ప్రేక్షకులు కూడా ఫిదా అయిపోతున్నారు.
అసలు సుకుమార్ లో ఈ కోణం కూడా ఉందా అనుకుంటూ ఆశ్చర్యపోతున్నారు. ముందు లవ్ స్టోరీస్ చేసాడు.. ఆ తర్వాత రివేంజ్ ఫార్ములాకు వచ్చాడు.. ఇప్పుడు కూడా రివేంజ్ డ్రామానే తీసాడు కానీ పాత కథనే మరింత కొత్తగా తీసాడు. పైగా హీరోకు చెవుడు.. ఇలా ఒక్కో అంశంపై చాలా సీరియస్ గా దృష్టిపెట్టి రంగస్థలాన్ని చిన్నసైజ్ సంచలనంగా మార్చేసాడు ఈ దర్శకుడు. మొత్తానికి ఇప్పుడు మళ్లీ స్టార్స్ అంతా ఈ దర్శకుడి వెంట పడటం ఖాయమైపోయింది. చూడాలిక.. సుకుమార్ నెక్ట్స్ ఏం చేస్తాడో..?