చిరంజీవి సినిమా అంటే ఏదో తెలియని వైబ్రేషన్ ఉంటుంది. అందుకే పదేళ్ళ తర్వాత వచ్చినా.. వయసు 63 అయినా కూడా ఖైదీ నెం.150కి బ్రహ్మ రథ పట్టారు ప్రేక్షకులు. ఆయన ఎప్పుడెప్పుడు మరో సినిమా చేస్తాడా అని చూస్తున్న వాళ్లకు సైరాతో సమాధానం ఇచ్చాడు మెగాస్టార్. ఈ చిత్ర షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ అనుకున్న టైమ్ లోనే పూర్తి చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ప్రస్తుతం సిజి వర్క్ నడుస్తుంది. దానికోసమే గడ్డం, మీసాలు తీసి ఆ మధ్య కొత్త లుక్ లోకి మారిపోయాడు చిరంజీవి. ఇప్పుడు మళ్లీ నార్మల్ లుక్ లోకి వచ్చేసాడు చిరు. తాజాగా కన్నడ ఇండస్ట్రీలో బిల్డింగ్ ఓపెనింగ్ లో మళ్లీ పాత చిరంజీవి కనిపించాడు.
తొలి షెడ్యూల్ లో చిరు తప్ప ఎవరూ రాలేదు. రెండో షెడ్యూల్ నుంచి స్టార్స్ సందడి కనిపించనుంది. నయనతారతో పాటు మిగిలిన చిత్రయూనిట్ కూడా రెండో షెడ్యూల్ లో సైరా సెట్ లో అడుగుపెట్టనున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో ఈ షెడ్యూల్ మొదలు కానుంది. ముందు ఈ షెడ్యూల్ ను రాజస్థాన్ లో ప్లాన్ చేసారు కానీ అక్కడ కొన్ని పరిస్థితులు సహకరించకపోవడంతో ఇప్పుడు కేరళకు షిఫ్ట్ చేసారు. అక్కడ ఇప్పటికే కొన్ని చోట్ల ఈ చిత్ర లొకేషన్స్ ఫైనల్ చేసాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. ఈ షెడ్యూల్ అయిపోయిన తర్వాతే రాజస్థాన్ వెళ్లనున్నారు యూనిట్.
రెండో షెడ్యూల్లోనే జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి సెట్ లో అడుగు పెట్టనున్నారు. విజయ్ సేతుపతి ఇందులో ఉయ్యాలవాడుకు అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఓబయ్య పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తుంది. ఇక ఫిబ్రవరి తర్వాత అమితాబ్ బచ్చన్ రానున్నారు. ఈ చిత్రంలో అత్యంత కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు అమితాబ్ బచ్చన్. మనం తర్వాత ఆయన నటిస్తున్న తెలుగు సినిమా ఇదే. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ చిత్ర విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మెగా వారసుడు. సురేందర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన తర్వాత కానీ రంగంలోకి దిగలేదు. 2019 సమ్మర్ కు సైరా విడుదల కానుంది. 200 కోట్లు ఈ చిత్రానికి ప్రాథమిక బడ్జెట్ గా నిర్ణయించారు. అది పెరిగినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదు.