ఎన్నో రోజులుగా అభిమానులను.. ఎన్నో ఏళ్లుగా చిరంజీవిని ఊరిస్తున్న మెగా ప్రాజెక్ట్ ఎట్టకేలకు పట్టాలెక్కింది. సైరా నరసింహారెడ్డి షూటింగ్ హైదరాబాద్ లోనే అట్టహాసంగా మొదలైంది. తొలిరోజు చిరంజీవితో పాటు బ్రహ్మాజీ కూడా షూటింగ్ లో పాల్గొన్నాడు. వాళ్లిద్దరిపైనే తొలి షాట్ ను చిత్రీకరించాడు దర్శకుడు సురేందర్ రెడ్డి. అయితే ఎక్కువ భాగం ఫోకస్ మాత్రం చిరంజీవే ఉన్నాడు. హైదరాబాద్ లోని అల్యూమీనియం ఫ్యాక్టరీలో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షూటింగ్ జరుగుతుంది. రామ్ చరణ్ తో పాటు మెగా ఫ్యామిలీలోని కొందరు కూడా ఈ షూటింగ్ కు వచ్చారు. ఇక నిర్మాత చరణ్ కొన్ని రోజులు తన పని మానుకుని మరీ తండ్రి పనిపై బిజీ కానున్నాడు. సురేందర్ రెడ్డితో కలిసి సెల్ఫీలు కూడా దిగాడు చరణ్. ఈ ఇద్దరూ కలిసి సైరాను బాలీవుడ్ కూడా బిత్తరపోయేలా సిద్ధం చేయాలని ఫిక్సైపోయారు.
తొలి షెడ్యూల్ హైదరాబాద్ లోనే 10 రోజుల పాటు జరగనుంది. ఇందులో చిరంజీవిపైనే సోలోగా సీన్స్ ప్లాన్ చేసాడు దర్శకుడు. నయనతారతో పాటు మిగిలిన చిత్రయూనిట్ కూడా రెండో షెడ్యూల్ లో సైరా సెట్ లో అడుగుపెట్టనున్నారు. జగపతిబాబు, సుదీప్, విజయ్ సేతుపతి, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్ ఇందులో నటిస్తున్నారు. తండ్రి సినిమా కోసమే తన రంగస్థలంకు కూడా 10 రోజులు బ్రేకిచ్చాడు రామ్ చరణ్. మెగాస్టార్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా రూపొందనున్న ఈ చిత్ర విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కావట్లేదు మెగా వారసుడు. సురేందర్ రెడ్డి కూడా అన్నీ ఫిక్సైన తర్వాత కానీ రంగంలోకి దిగలేదు. డిసెంబర్ మూడో వారంలో సైరాకు బ్రేక్ ఇవ్వనున్నారు. 2019 సంక్రాంతికి సైరాను విడుదల చేయబోతున్నారు దర్శక నిర్మాతలు. 200 కోట్లు ఈ చిత్రానికి ప్రాథమిక బడ్జెట్ గా నిర్ణయించుకున్నారు. అది పెరిగినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదు.