ఎలాంటి దర్శకుడైనా ఒక్క ఫ్లాప్ ఇస్తే చాలు.. అతడి ముందు విజయాలన్నీ మరిచిపోయే ఇండస్ట్రీ ఇది. అది వాళ్ల తప్పు కాదు.. ఇండస్ట్రీ పోకడ అంతే మరి. ఇక్కడ విజయాలకే కానీ పరాజయాలకు చోటుండదు. అందుకే అగ్ర దర్శకులకు కూడా అప్పుడప్పుడూ ఈ తిప్పలు తప్పవు. ఇప్పుడు మురుగదాస్ కు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. స్పైడర్ ముందు వరకు కూడా ఈయన సినిమా అంటే ఎక్కడలేని అంచనాలుండేవి.
కానీ ఒక్క సినిమాతో ఈయన ఇమేజ్ చాలా పడిపోయింది. అప్పటి వరకు కెరీర్ లో ఎన్ని సినిమాలు చేసినా.. ఎందుకు చేసాడ్రా బాబూ ఈ సినిమా అని విమర్శించేంత చెత్త సినిమా అయితే చేయలేదు మురుగదాస్. కానీ స్పైడర్ తో ఆ విమర్శలు వచ్చాయి. 100 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టించి.. ఓ నాసీరకం సినిమా తీసాడంటూ మురుగదాస్.. మహేశ్ పై విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఆ విమర్శలను తొలగించుకునే పనిలో పడ్డాడు ఈ దర్శకుడు.
ఇప్పటికే భరత్ అనే నేనుతో స్పైడర్ బాధను కాస్తైనా తగ్గించాడు మహేశ్. ఇప్పుడు మురుగదాస్ వంతు. ఈయన ప్రస్తుతం విజయ్ తో సినిమా చేస్తున్నాడు. ఈ కాంబినేషన్ అంటేనే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి కారణం వాళ్ల ముందు సినిమాలే. కత్తి.. తుపాకి లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత విజయ్-మురుగదాస్ చేస్తోన్న సినిమా ఇది. చిత్రం ఏంటంటే కత్తి.. తుపాకికి ముందు కూడా మురుగదాస్ కు ఫ్లాపులు ఉన్నాయి.
అప్పుడు కూడా విజయ్ తోనే హిట్ కొట్టాడు ఈ దర్శకుడు. ఇప్పుడు కూడా ఇదే సీన్ రిపీట్ చేయాలని చూస్తున్నాడు. ఈ చిత్రం 100 కోట్ల బడ్జెట్ తో రూపొందుతుంది. ఇప్పటికే షూటింగ్ సగానికి పైగా పూర్తయింది. దసరాకు విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. మరి చూడాలి.. స్పైడర్ జ్ఞాపకాలను మురుగదాస్ ఎంతవరకు చెరిపేస్తాడో..?