నాని చిన్న హీరో అనే ఇమేజ్ 2017తోనే వెళ్లిపోయింది. ఇప్పుడు కొత్త ఏడాది కొత్త ఇమేజ్ తో వస్తున్నాడు న్యాచురల్ స్టార్. ఇప్పుడు ఈయన ఇమేజ్ చాలా ఎక్కువ.. క్రేజ్ ఎక్కువే.. మార్కెట్ అయితే చెప్పాల్సిన పనిలేదు. దక్షిణాదిన ఏ హీరోకు సాధ్యం కాని రికార్డులు సొంతం చేసుకున్నాడు నాని. 2017 ఈ హీరో ఇమేజ్ ను మూడింతలు పెంచేసింది. మొన్నొచ్చిన ఎంసిఏ కూడా డివైడ్ టాక్ తోనే 50 కోట్ల మార్క్ అందుకుంది. ఇక గతేడాది ఈయన నటించిన మూడు సినిమాలు విజయం సాధించడమే కాదు.. ఓవర్సీస్ లోనూ మిలియన్ మార్క్ అందుకున్నాయి. దక్షిణాది ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకు కూడా సాధ్యం కాని రికార్డ్ ఇది. నేనులోకల్ 1.2 మిలియన్.. నిన్నుకోరి 1.4 మిలియన్.. ఎంసిఏ 1.1 మిలియన్ దాటి సంచలనం సృష్టించాయి. వరసగా మూడు మిలియన్ మార్క్ సినిమాలు.. అది కూడా ఒకే ఏడాదిలో అందుకోవడం నానికి మాత్రమే సాధ్యమైంది. ప్రస్తుతం ఈ హీరో ఖాతాలో 5 మిలియన్ మార్క్ సినిమాలున్నాయి. టాలీవుడ్ లో మహేశ్ 7 సినిమాలతో అగ్రస్థానంలో ఉంటే.. తర్వాత నాని, ఎన్టీఆర్ ఐదేసి సినిమాలతో రెండో స్థానంలో ఉన్నారు.