పవన్ కళ్యాణ్ కు నిజంగా అంత స్టామినా ఉందా..? ఒకప్పుడు చిరంజీవి వచ్చి కూడా ఏం చేయలేకపోయాడు. కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఇప్పుడు హాయిగా సినిమాలు చేసుకుంటున్నాడు. అప్పుడు అన్నయ్య చేయలేనిది ఇప్పుడు తమ్ముడు చేస్తాడా అంటూ ఇప్పటికే పవన్ పై కావాల్సినన్ని విమర్శలు చేస్తున్నారు. కానీ అన్నింటినీ మౌనంగా భరిస్తున్నారు పవర్ స్టార్. సమయం వచ్చినపుడు అన్నింటికీ సమాధానం చెప్తానంటూ కూర్చున్నారాయన. ఇప్పుడు అందరి మదిలోనూ ఒకటే అనుమానం జనసేనకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మార్చేంత సత్తా ఉందా అని..? ఏమో దీనికి సమాధానం మాత్రం ఎవరూ చెప్పలేకపోతున్నారు. దానికి కారణం కూడా లేకపోలేదు. పవన్ ఎప్పుడు ఆవేశం తోనే ఉంటాడు. కానీ జనసేనలో ఆయన తర్వాత సెకండ్ లీడర్ అంటూ ఎవరూ కనిపించరు.
ఎవరి మైండ్ అయినా చదవొచ్చు కానీ పవన్ ను మాత్రం అంచనా వేయడం చాలా అంటే చాలా కష్టం. ఈయన్ని అర్థం చేసుకోడానికే ఓ జీవితం సరిపోయేలా లేదు. త్రివిక్రమ్ ఇది ముందుగానే ఊహించాడో ఏమో కానీ అజ్ఞాతవాసిలో వీడి చర్యలు ఊహాతీతం అంటూ డైలాగ్ రాసాడు. పవన్ ఇప్పుడు చేస్తోన్న పనులు కూడా ఇలాగే ఉన్నాయి. ఈయన చేస్తున్న పనులు ఇప్పుడు ఎవరికీ అంతుచిక్కడం లేదు. ప్రజలకు అన్యాయం చేస్తే కచ్చితంగా ఎవరితో అయినా పోరాటానికి సిద్ధమని మొండిగా ముందుకెళ్లిపోతున్నాడు పవర్ స్టార్.
తనకు దేశ, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమని.. వాటి ప్రయోజనం కోసం ఎవరితో కలిసి పోరాడ్డానికైనా సిద్ధం అని ఆనాడే చెప్పాడు పవన్. ఇప్పుడు బిజేపీ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు పూర్తి చేయడం లేదని.. టీడిపి కూడా నమ్మకంగా చెప్పి మోసం చేసిందంటూ చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్. మరోవైపు ఇన్నాళ్లూ కాస్త స్తబ్ధుగా ఉన్నట్లు అనిపించిన జనసేన పార్టీ పనులు కూడా ఊపందుకుంటున్నాయి. తాజాగా ఈయన సభతో ఈ పార్టీ జనాల్లోకి వెళ్లిపోతుంది. అంతేకాదు.. ఆగస్ట్ 14, 15 తేదీల్లో జరగబోయే సభలో తన పార్టీ మ్యానిఫెస్టోను కూడా బయట పెట్టబో తున్నాడు పవర్ స్టార్.
తాను ఎందుకు సినిమాలను వదిలేసి రాజకీయాల్లోకి వచ్చానో.. జనానికి బాగా అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. తన పార్టీ విధానాలేంటో చెబుతున్నాడు ఈయన. తెలంగాణ, ఆంధ్రా మేధావులతో కలిసి కూర్చుని.. సమస్యల గురించి డిస్కస్ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఇక ఇప్పుడు రాజకీయాల్లో ఈయన దూకుడు చూస్తుంటే.. సినిమాలకు పూర్తిగా దూరమైపోయినట్లే అనిపిస్తుంది. మరి చూడాలిక.. పవన్ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో..? ఆయన నిజంగానే ఏపీ రాజకీయ ముఖచిత్రాన్ని రాబోయే ఎన్నికల్లో మార్చేసి చూపిస్తారేమో..?