27న రామ్ ‘ఉన్నది ఒకటే జిందగీ’ విడుదల

 

ఎన్ని ఎత్తుపల్లాలు వచ్చినా జిందగీ మొత్తం మనతో ఉండేవాడే నిజమైన స్నేహితుడని నమ్మే యువకుడు అభిరామ్‌. నలుగురు స్నేహితులతో కలసి రాక్‌బ్యాండ్‌ను స్టార్ట్‌ చేస్తాడు. ఆ రాక్‌బ్యాండ్‌కి అతనే లీడర్‌. చిన్నప్పట్నుంచి హ్యాపీగా వెళ్తోన్న అభిరామ్‌ లైఫ్‌లోకి ఇద్దరమ్మాయిలు వస్తారు. వాళ్లలో ఎవరితో అభిరామ్‌ ప్రేమలో పడ్డాడు? అభిరామ్‌ జిందగీలో స్నేహితులు ఎలాంటి పాత్ర పోషించారు? అసలు, అభిరామ్‌ కథేంటి? అనేది ఈ నెల (అక్టోబర్‌) 27న చూపిస్తామంటున్నారు దర్శకుడు కిశోర్‌ తిరుమల. యంగ్‌ అండ్‌ ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా ఆయన దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘ఉన్నది ఒకటే జిందగీ’. అనుపమా పరమేశ్వరన్, లావణ్యా త్రిపాఠి హీరోయిన్లు. ‘స్రవంతి’ రవికిశోర్, పీఆర్‌ సినిమాస్‌ సమర్పణలో స్రవంతి సినిమాటిక్స్‌ పతాకంపై కృష్ణచైతన్య నిర్మించిన ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ నెల 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఈ సందర్భంగా ‘స్రవంతి’ రవికిశోర్‌ మాట్లాడుతూ– ‘‘ఇటలీలో రామ్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో సినిమా మొత్తం పూర్తయింది. ప్రేమ, స్నేహం నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. రామ్‌ అద్భుతంగా నటించాడు. కిశోర్‌ కథ, కథనం, దర్శకత్వం… ప్రతిదీ కొత్త పంథాలో ఉంటుంది. రామ్, కిశోర్‌ తిరుమల కలయికలో మేం నిర్మించిన ‘నేను శైలజ’ తరహాలో ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో పాటల్ని, అక్టోబర్‌ 27న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం’’ అన్నారు.

దర్శకుడు కిశోర్‌ తిరుమల మాట్లాడుతూ– ‘‘అభిరామ్‌ అనే వ్యక్తి జిందగీలో చైల్డ్‌హుడ్, కాలేజ్‌ లైఫ్, కాలేజ్‌ తర్వాత లైఫ్‌ని ఈ సినిమాలో చూపిస్తున్నాం. అభిరామ్‌గా రామ్‌ జీవించారు. పాత్ర కోసం బాడీ మేకోవర్‌ కావడంతో పాటు సరికొత్త సై్టల్‌లోకి మారారు. అతని నలుగురు స్నేహితులుగా శ్రీవిష్ణు, ప్రియదర్శి, కిరీటి, కౌషిక్‌ కనిపించనున్నారు. అభిరామ్‌ కథలో భాగంగానే ప్రేమకథలూ ఉంటాయి. విడుదల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’’ అన్నారు.

ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్రకాష్, ఎడిటింగ్‌: శ్రీకర్‌ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.