సమాజానికి రక్షణ కల్పించడంలో పోలీసుల తర్వాతే ఎవరైనా! వారు చేసే కష్టానికీ, తీసుకునే జీతానికీ ఎక్కడా పొంతనే ఉండదు. అయినా నిత్యం ప్రజల సంరక్షణకు పాటుపడుతుంటారు. మరి అలాంటి పోలీసులకు వ్యక్తిగత జీవితం ఎలా ఉంటుంది? ఒత్తిళ్లతో కూడిన ఉద్యోగాన్ని ఎలా నిర్వర్తిస్తారు. మనలో ఒకడిగా మెలిగిన వ్యక్తి ఒంటిమీదకు పోలీస్ యూనిఫార్మ్ రాగానే ఎలా మసలుకుంటాడు? ఎలా మసలుకోవాలి? తన మనసును, కుటుంబాన్ని, ఉద్యోగాన్ని అతను సమన్వయం చేసుకునే తీరు ఎలా ఉంటుంది? వంటి ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిన చిత్రం `ఖాకి`. ఇప్పటివరకు ఎన్నో సినిమాలతో తమిళ ప్రేక్షకులనే కాకుండా తెలుగువారిని కూడా అలరించిన కార్తి ఈ సినిమాలో హీరోగా నటించారు. తెలుగు చిత్రాల్లో బబ్లీగానూ, పెర్ఫార్మర్‌గానూ పేరు తెచ్చుకున్న గ్లామర్ భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటించారు. ఆడియో రంగంలో తనదైన నాణ్యతతో, మన్నికతో గొప్ప ముద్రను వేసుకున్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ఈ సినిమాను తెలుగులో అందిస్తోంది. ఆదిత్య మ్యూజిక్ ప్రైవేట్ లిమిటెడ్ అధనేత ఆదిత్య ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా ఈ సినిమాకు నిర్మాతలు. ఇటీవల విడుదలైన `ఖాకి` ఆడియోకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నెల 17న సినిమా విడుదల కానుంది.
నిర్మాతలు మాట్లాడుతూ “పాటలు అన్ని వర్గాల వారికీ నచ్చాయి. జిబ్రాన్ సంగీతాన్ని అంతా మెచ్చుకుంటున్నారు. ప్రతి పాటా యూత్‌ని అలరిస్తోంది. ప్రతి పాటా ట్రెండీగా ఉందని అందరూ చెబుతుంటే ఆనందంగా ఉంది. `ఖాకి` రోల్లో కార్తి చక్కగా పెర్ఫార్మ్ చేశారు. పోలీస్‌గా ఆయన నటన తెలుగువారికి తప్పక నచ్చుతుంది. ఈ నెల 17న భారీ స్థాయిలో విడుదల చేస్తున్నాం. తెలుగువారికి మంచి సినిమాను మా సంస్థ తరఫున అందిస్తున్నందుకు ఆనందంగా ఉంది“ అని చెప్పారు.
దర్శకుడు వినోద్ మాట్లాడుతూ “నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని తయారు చేసుకున్న కథ ఇది. పోలీసుల గురించి ఇప్పటివరకు చాలా కథల్లో చూసే ఉంటాం. కానీ ఇందులో హిస్టరీ బిహైండ్ ది క్రైమ్ నెట్ వర్క్ అనేది చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రేక్షకులు తప్పకుండా కొత్తదనాన్ని ఫీలవుతారు. ఆదిత్య సంస్థ భారీ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ప్రేక్షకులకు `ఖాకి` పైసా వసూల్ చిత్రమవుతుంది“ అని అన్నారు.
హీరో మాట్లాడుతూ “పోలీస్ పాత్రల్లో కనిపించాలని ప్రతి హీరోకీ ఉంటుంది. తమిళ ఆడియన్స్ నన్ను ఆ పాత్రలో ఇంతకు ముందు చూశారు. కానీ తెలుగు ప్రేక్షకులకు నేను చేసిన ఖాకి రోల్ కొత్తగా ఉంటుంది. నవ్యతను నిత్యం ఆహ్వానించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాను అక్కున చేర్చుకుంటారనే నమ్మకం ఉంది. చూసిన ప్రతి ఒక్కరికీ నచ్చే సినిమా అవుతుంది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు వస్తాం“ అని చెప్పారు.
కార్తి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో అభిమన్యు సింగ్, బోస్ వెంకట్, స్కార్లెట్ మెల్లిష్ విల్సన్ తదితరులు ఇతర తారాగణంగా నటించారు. ఈ చిత్రానికి కెమెరా: సత్యన్ సూరన్, సంగీతం: జిబ్రాన్, ఆర్ట్: కె. ఖదీర్, ఎడిటర్: శివనందీశ్వరన్, ఫైట్స్: దిలీప్ సుబ్బరాయన్, డ్యాన్స్: బృంద, నిర్మాతలు: ఉమేశ్ గుప్తా, సుభాష్ గుప్తా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.వి. శ్రీధర్ రెడ్డి.