ఇండియన్ సినిమాలకు ఇప్పుడు విదేశాల్లో కూడా మంచి క్రేజ్ వస్తుంది. అక్కడ కూడా మన సినిమాల కోసం ప్రేక్షకులు వేచి చూస్తున్నారు. కానీ అన్ని దేశాలు వేరు.. చైనా వేరు. అక్కడ ఎలాంటి సినిమాలు ప్రేక్షకులు ఇష్టపడతారో ఓ క్లారిటీ లేదు. ముఖ్యంగా వాళ్లకు ఎమోషనల్ సినిమాలైతే బాగా కనెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి దంగల్ సినిమానే ఉదాహరణ. ఈ చిత్రం అక్కడ అక్షరాలా 1200 కోట్లు వసూలు చేసింది. అయితే అక్కడ ట్యాక్స్ ప్లస్ డిస్ట్రిబ్యూటర్ షేర్ పోనూ మన నిర్మాతలకు వచ్చింది కేవలం 120 కోట్లే.. అది వేరే విషయం. కానీ వసూళ్లైతే భారీగా వచ్చాయి కదా అని ఇప్పుడు మిగిలిన వాళ్లు కూడా చైనా మార్కెట్ పై కన్నేసారు. రజినీకాంత్ 2.0 చైనాలో ఏకంగా 15000 థియేటర్స్ లో విడుదల కానుంది. ఇది నిజంగా ఓ రికార్డ్. 20000 థియేటర్స్ ఉన్న చైనాలో 75 శాతం స్క్రీన్స్ లో 2.0నే వస్తుంది.
ఎప్రిల్ లో 2.0 విడుదల కానుంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఇప్పటి వరకు చైనాలో కేవలం అమీర్ ఖాన్ సినిమాలకు మాత్రమే డిమాండ్ ఉంది. బాహుబలిని చైనాలో విడుదల చేసి చేతులు కాల్చుకున్నారు దర్శక నిర్మాతలు. అంటే అక్కడి వాళ్లకు మన వార్ సినిమాలు పెద్దగా నచ్చవు. టెక్నాలజీ ఎక్కువగా ఉన్నా.. విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్న బాహుబలిని కూడా వాళ్లు తిప్పికొట్టారు. ఈ లెక్కన 2.0 సైన్స్ ఫిక్షన్ డ్రామా. ఇప్పటికే అక్కడ ఇలాంటి సినిమాలు చాలానే వచ్చుంటాయి. కానీ వాటన్నింటినీ మించి ఏదో ఉందని 2.0లో శంకర్ చైనీయులకు చూపించాలి. లేదంటే వాళ్ల మనసులు గెలుచుకోవడం కష్టమే. ఒకేసారి కాకుండా కాస్త టైమ్ తీసుకుని విడుదల చేస్తే ఫలితం మరోలా ఉండే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.
ఇక ఇప్పుడు మరో హీరో కూడా చైనా మార్కెట్ పై దండెత్తడానికి రెడీ అయ్యాడు. ఆయనే సల్మాన్ ఖాన్. ఈయన నటించిన భజరంగీ భాయీజాన్ చైనాలో విడుదల కానుంది. ఈ చిత్రాన్ని అక్కడ లిటిల్ లోలిత మంకీ గాడ్ అంకుల్ పేరుతో అనువదిస్తున్నారు. భజరంగీ భాయీజాన్ కూడా బాగా ఎమోషనల్ స్టోరీ. 2015లో ఇక్కడ విడుదలైన సినిమా 600 కోట్లు వసూలు చేసింది. పాక్ నుంచి తప్పిపోయిన ఓ మూగ అమ్మాయిని తిరిగి తన ఇంటికి హీరో ఎలా చేర్చాడు అనేది కథ. ఇండియా పాక్ మధ్య వచ్చిన సన్నివేశాలన్నీ హృదయాన్ని హత్తుకునేలా ఉన్నాయి. ఈ చిత్రం చైనాలో కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నారు చిత్రయూనిట్. మొత్తానికి చూడాలిక.. ఇండియాలో చరిత్ర సృష్టించిన భజరంగీ భాయీజాన్ చైనా మార్కెట్ లో ఏం చేస్తుందో..?