అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో ఇదే నడుస్తుంది. కాస్త ఆలోచిస్తే అదే అర్థమైపోతుంది. సాధారణంగా ఏ ఇండస్ట్రీలో అయినా ఫ్లాప్ దర్శకుల్ని పెద్దగా పట్టించుకోరు. ఒక్క ఫ్లాప్ అయితే ఓకే కానీ రెండు మూడు ఫ్లాపులు ఇస్తే కనీసం చూడను కూడా చూడరు. అలాంటి దర్శకులకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని హీరోలతో పాటు నిర్మాతలు కూడా పక్కకు వెళ్లిపోతుంటారు. కానీ గీతాఆర్ట్స్ మాత్రం ఓ స్ట్రాటజీ ప్రకారం వెళ్లిపోతుంటుంది. అల్లు అరవింద్ ఏరికోరి ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సిస్తుంటాడు. ఆయన అవకాశమిచ్చిన ఏ దర్శకుడు ఫ్లాప్ ఇవ్వలేదు. కసితో వచ్చిన అవకాశాన్ని వాడేసుకుంటున్నారు వాళ్లు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు ఈ మెగా నిర్మాత.
బ్రహ్మోత్సవం తర్వాత ఇండస్ట్రీ పూర్తిగా మరిచిపోయిన శ్రీకాంత్ అడ్డాలకు పిలిచి మరి అవకాశమిస్తున్నాడు అల్లు అరవింద్. అంతా కొత్త వాళ్లతో శ్రీకాంత్ త్వరలోనే గీతాఆర్ట్స్ లో ఓ సినిమా చేయబోతున్నాడు. కొత్త బంగారులోకం తరహాలో ఇది కూడా ప్రేమకథే. ఒక్క శ్రీకాంత్ కు మాత్రమే కాదు.. ఈ మధ్య కాలంలో వరసగా ఫ్లాప్ డైరెక్టర్స్ కే అవకాశం ఇస్తున్నాడు అల్లు అరవింద్. బొమ్మరిల్లు భాస్కర్ కూడా అల్లు శిరీష్ కోసం ఓ కథ సిద్ధం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతేడాది అల్లు శిరీష్ కు శ్రీరస్తు శుభమస్తుతో తొలి కమర్షియల్ హిట్టిచ్చిన పరుశురాంకు దానికి ముందు సారొచ్చారు లాంటి ఫ్లాప్ ఉంది. ధృవకు ముందు సురేందర్ రెడ్డి కిక్ 2 లాంటి డిజాస్టర్ ఇచ్చాడు. అయినా వాళ్లపై నమ్మకంతో సినిమా ఇచ్చాడు.. సక్సెస్ కొట్టాడు ఈ మెగా ప్రొడ్యూసర్. ఇప్పుడు కూడా శ్రీకాంత్ అడ్డాలను నమ్ముతున్నాడు. మరి ఈయనేం చేస్తాడో చూడాలిక..!