రజినీకాంత్ రాజకీయాల్లోకి వస్తున్నాడా..? వస్తే ఎప్పుడొస్తాడు..? ఎలా వస్తాడు..? వస్తే ఏం చేస్తాడు..? అసలు ఆయన మనసులో ఏముంది..? ఇలా ఎన్నో సమాధానం లేని ప్రశ్నలు ప్రస్తుతం తమిళనాట ఉన్నాయి. మనసు ఒకటి చెబితే.. నోరు ఒకటి చెబుతుందన్నట్లు.. రజినీ కూడా రాజకీయాల గురించి ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నాడు. ఆసక్తి లేదంటూనే.. మరోవైపు తను చేస్తోన్న పనులతో రాజకీయాల్లోకి వస్తున్నట్లు హింట్లు ఇస్తున్నాడు. ఇది వరకు అలవాటు లేని పనులు కూడా ఇప్పుడు చేస్తున్నాడు సూపర్ స్టార్. ఫ్యాన్స్ తో మీటింగ్ లు.. ప్రజలతో ఛాటింగ్ లు.. రైతులతో కలిసి మాట్లాడటాలు.. ఇవన్నీ కొత్తగా చేస్తోన్న పనులే.
ఇప్పుడు ఈయన ఫ్యాన్స్ తో సపరేట్ గా మీటింగ్స్ ప్లాన్ చేస్తున్నాడు. భవిష్యత్తులో తీసుకోబోయే కొన్ని కీలకమైన నిర్ణయాల గురించి వాళ్లతో చర్చింబోతున్నాడు రజినీకాంత్. ఆ మధ్య నదుల అనుసంధానం కోసం నిరసన చేస్తున్న 16 మంది రైతుల్ని కలిసి వారికి తన మద్దత్తు తెలిపాడు రజినీకాంత్. అంతటితో ఆగకుండా.. ఆ అనుసంధానానికి అయ్యే ఖర్చు నిమిత్తం కోటి రూపాయల విరాళం కూడా ప్రకటించారు. ఈ విషయంపై ప్రధాని మోదీతో మాట్లాడతానని హామీ ఇచ్చారు. రజినీకాంత్ కు నరేంద్రమోదీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆ మధ్య తమిళనాడు వచ్చినపుడు ప్రత్యేకంగా రజినీకాంత్ ఇంటికి వచ్చి కలిసాడు మోదీ. లా రజనీ రైతుల సమస్యలపై స్పందించడం, ప్రధానితో చర్చలు జరుపుతామని అనడం.. అభిమానులతో చర్చలు.. ఇవన్నీ తమిళనాట రాజకీయ వర్గాల్లో అగ్గి రాజేసేలా చేస్తుంది. రజినీ పొలిటికల్ ఎంట్రీ ఖాయం.. కాకపోతే సొంత పార్టీ పెడతారా.. బిజేపీలో జాయిన్ అవుతారా అనేది మాత్రం సస్పెన్స్..!