సినిమా వేడుకలకు వచ్చినపుడు సినిమాల గురించి గానీ.. లేదంటే వాళ్లు పడిన కష్టం గురించి కానీ చెప్పుకుంటారు. కానీ పవన్ మాత్రం చాలా వింతగా మాట్లాడాడు. దేశం నుంచి మొదలుపెట్టి.. దేశంతోనే ముగించాడు. అజ్ఞాతవాసి ఆడియోలో పవన్ స్పీచ్ చూస్తుంటే ఆయనకు అసలు సినిమాలంటే ఇష్టం లేదని మరోసారి తేలిపోయింది. చూస్తుంటే ఇదే చివరి సినిమా ఏమో అనే అనుమానం కూడా వచ్చేసింది. భారత్ మాతా కీ జై.. భారత్ మాతా కీ జై.. అంటూ అక్కడికి వచ్చిన అభిమానులతో పాటు బయట రాలేకపోయిన.. ట్రాఫిక్ లో ఇరుక్కుపోయిన వాళ్లకి ముందుగా క్షమాపణలు చెప్పాడు పవన్. అభిమానించే ప్రతీ ఒక్కరినీ గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది. కానీ హృదయం వైశాల్యంగా ఉన్నా..శరీరం చిన్నది. మీ అందరికీ పేరుపేరునా.. టీవీల్లో చూస్తున్న ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు చెప్పాడు పవన్.
తాను సినిమాల్లోకి వచ్చినపుడు మహా అయితే 10-12 సినిమాలు చేస్తానని అనుకున్నానని.. ఆ తర్వాత ఏం చేయాలో తనకు కూడా తెలియ దని చెప్పాడు పవన్. అయితే మీ అభిమానమే పాతిక సినిమాలు చేసేలా చేసిందని.. ఇక ఇప్పుడు తన అంతిమలక్ష్యం దేశసేవ చేయడమే అని చెప్పాడు పవన్. అంటే ఈ లెక్కన అజ్ఞాతవాసి తర్వాత ఇక చాలు.. పాతిక సరిపోయింది అని చెబుతున్నాడేమో అనిపిస్తుంది. తనకు ఇంత ప్రేమ ఇచ్చిన అభిమానులకు.. సినిమాలకు.. కళామతల్లికి ఎప్పుడూ తాను రుణపడే ఉంటానని చెప్పాడు పవర్ స్టార్.
జానీ తర్వాత తాను ఫ్లాపుల్లో ఉన్నపుడు తన హితులు.. తాను అండగా నిలబడిన వాళ్లే తనను పట్టించుకోలేదని అలాంటి టైమ్ లో తనకు అండగా నిలబడిన వ్యక్తి త్రివిక్రమ్ అని చెప్పాడు పవర్ స్టార్. ఆయనంటే తనకు చాలా గౌరవం అని.. అంతా అంటారని పవన్ లేకపోతే త్రివిక్రమ్ లేడు.. ఆయనకు గైడ్ గా ఉంటాడు అని.. అసలు తాను కాకపోతే మరో హీరోతో సినిమాలు చేస్తాడు.. తన అవసరం త్రివిక్రమ్ ఏ లేదని చెప్పాడు ఈ హీరో. విజయం సాధించినపుడు చుట్టూ మనుషులుంటారు.. గెలుస్తున్నపుడు మనుషులుంటారు.. కానీ కిందకు వెళ్లిపోతున్నపుడు ఓటమి పాలవుతున్నపుడు ఎవరూ ఉండరు.. అది తనకు బాగా తెలుసన్నాడు పవన్. అభిమానులు తననెపుడూ వదల్లేదు కానీ చుట్టు పక్కల ఉన్న వాళ్లు మాత్రం వదిలేసారని చెప్పాడు పవర్ స్టార్. అలాంటి టైమ్ లో తనకు అండగా ఉన్నది త్రివిక్రమ్ అన్నాడు పవన్.
ఇక ఈ స్పీచ్ అంతా అయిపోయిన తర్వాత సినిమా గురించి మాట్లాడాడు పవన్. తానెప్పుడూ తన సినిమా బాగుంటుంది చూడండి అని ఏ రోజు చెప్పలేదని.. కాకపోతే ఈ చిత్రం మాత్రం అభిమానులకు నచ్చేలా చేసామని చెప్పాడు పవన్. ఈ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి అని చెప్పు కొచ్చాడు పవర్ స్టార్. దేశంలోని అన్ని మూలల నుంచి వచ్చిన వాళ్లంతా కలిసి ఈ చిత్రం చేసారని చెప్పాడు పవన్. అది తనకు ఎంతో గౌరవాన్ని ఇస్తుందని చెప్పాడీయన. మొత్తానికి పవన్ స్పీచ్ విన్న తర్వాత ఈయన సినిమాల నుంచి బయటికి వచ్చేస్తున్నాడేమో అనిపించడం మాత్రం ఖాయం. మరి చూడాలిక.. అజ్ఞాతవాసితో ఈయన ఇంకెన్ని సంచలనాలు సృష్టించబోతున్నాడో..? జనవరి 10న ఈ చిత్రం విడుదల కానుంది.