దేవీ శ్రీ ప్రసాద్.. థమన్.. అనిరుధ్.. ఇప్పుడంటే వీళ్లొచ్చారు కానీ కాలం ఒక్క పదేళ్లు వెనక్కి తిప్పితే అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మణిశర్మ అనే పేరు తప్ప మరోటి వినిపించేదే కాదు. ఒకప్పుడు ఈ పేరు టాలీవుడ్ లో ట్రెండ్. కోటి, ఎస్ ఏ రాజ్ కుమార్ తరం తర్వాత తెలుగు ఇండస్ట్రీ సంగీత ప్రపంచాన్ని పదేళ్ల పాటు మకుటం లేని మహారాజులా ఏలాడు మణిశర్మ. చిరంజీవి నుంచి రామ్ చరణ్ వరకు.. బాలయ్య నుంచి ఎన్టీఆర్ వరకు.. నాగార్జున నుంచి అఖిల్ వరకు అందరు హీరోలతోనూ పని చేసిన ఘనత మణిశర్మకే దక్కుతుంది. పదేళ్ల టైమ్ లోనే `100 సినిమాలకు పైగా మ్యూజిక్ ఇచ్చాడు మణి. ఎన్నో సినిమాలను తన మ్యూజిక్ తో నిలబెట్టిన మణి.. ఈ మధ్య పూర్వపు ఫామ్ చూపించలేకపోయాడు. 2012లో వచ్చిన రచ్చ తర్వాత మణిశర్మ కెరీర్ లో మరో హిట్ లేదు. మరోవైపు మ్యూజిక్ లో కూడా గత స్థాయి కనిపించలేదు. దాంతో మణిశర్మ కెరీర్ ఇక పూర్తైపోయినట్లే అనుకున్నారంతా.
దీనికి తగ్గట్లే ఆఫర్ ల కోసం వేచి చూడకుండా టెంపర్, సీతమ్మ వాకిట్లో, అఖిల్ లాంటి సినిమాలకు బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు మణి. ఇలాంటి టైమ్ లో ఇప్పుడు తనలో ఇంకా పస తగ్గలేదని గతేడాది జెంటిల్ మన్ తో నిరూపించాడు మణిశర్మ. ఆ సినిమాలో తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో కేక పెట్టిం చాడు మణి. చాలా సన్నివేశాలు కేవలం మణిశర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ వల్లే హైలైట్ అయ్యాయంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ చిత్రంతో పాటు ఇప్పుడు ఒక్కక్షణంతో మరోసారి తన టాలెంట్ చూపించాడు ఈ సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్. ఇందులోనూ పాటలు ఆకట్టుకోకపోయినా.. ఆర్ఆర్ మాత్రం అదరగొట్టాడు మణిశర్మ. తాను తప్ప ఈ చిత్రానికి మరే సంగీత దర్శకుడు న్యాయం చేయలేడేమో అనిపించేంతగా ఒక్కక్షణం సినిమాకు ఆర్ఆర్ ఇచ్చాడు మణి. మొత్తానికి చాలా ఏళ్ళ తర్వాత మణిశర్మ నుంచి మంచి ఔట్ పుట్ వచ్చింది. ఇప్పుడైనా మణిశర్మ వైపు మళ్లీ స్టార్ హీరోలు లుక్ వేస్తారేమో చూడాలిక..!