ప‌ద్మావ‌తి.. వేలాడుతుంది క‌త్తి.. 

ప్ర‌పంచంలోనే అతిపెద్ద ప్ర‌జాస్వామ్య దేశం.. ఇక్క‌డ ఎవ‌రికి తోచింది వాళ్లు మాట్లాడుకోవ‌చ్చు.. ఎవ‌రి భావ స్వాతంత్ర్యానికి ఎవ‌రూ అడ్డు ప‌డ‌రు. ఎవ‌రికి కావాల్సింది వాళ్లు తీసుకోవ‌చ్చు.. ఏది కావాలంటే అది చేయొచ్చు. మ‌న‌సుకు న‌చ్చింది తెర‌పై ఆవిష్క‌రించొచ్చు.. ఇన్నాళ్లూ ఇండియా గురించి ఇదే వినిపించిన మాట‌లు. కానీ మాట‌ల్లో ఉన్నంత స్వేచ్చ నిజంగా ఇండియాలో ఉందా..? ఏమో ఇప్పుడు లేద‌నే స‌మాధానే చెప్పాల్సి వ‌స్తుంది కొన్ని ప‌రిస్థితులు చూస్తుంటే. ముఖ్యంగా ప‌ద్మావ‌తి సినిమాకు ప‌ట్టిన గ‌తి చూస్తుంటే. ఎన్నోసార్లు మ‌న స్వేచ్ఛ‌ను ప‌క్క‌వాళ్లు హ‌రిస్తుంటారు. మ‌నం చూస్తూ ఊరుకుంటాం కానీ ఏమీ చేయ‌లేం. ప‌ద్మావ‌తి సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రుగుతుంది. ఓ ద‌ర్శ‌కుడు ఏళ్ల‌కేళ్లు క‌ష్ట‌ప‌డి చేసిన సినిమాను అడ్డంగా ఆపేసారు.
ఎప్పుడో సెన్సార్ కావాల్సిన సినిమాను ఇప్పుడు పూర్తి చేసారు. అది కూడా త‌మ‌కు న‌చ్చిన‌ట్లుగా..! ఒక‌టి రెండు కాదు.. ఏకంగా 26 క‌ట్లు వేసి సినిమాను విడుద‌ల చేసుకోమ‌న్నారు. అది కూడా టైటిల్ ప‌ద్మావ‌త్ గా మార్చేసి..! ద‌ర్శ‌కుడికి ఇష్టం ఉందా లేదా అనే ప్ర‌శ్న‌లు ఇక్క‌డ అవ‌స‌రం లేదు.. సినిమా విడుద‌ల కావాలంటే మేం చెప్పిన‌ట్లే చేయ్ లేదంటే తీసిన సినిమాను మూసుకుని ఇంట్లోనే పెట్టుకో అనేంత‌గా మారిపోయింది ఇప్పుడు ప్ర‌భుత్వం కూడా. ఇలా బ‌లైపోయిన సినిమా ప‌ద్మావ‌తి. డిసెంబ‌ర్ 1 నుంచి సినిమా ఇప్ప‌టికీ రాలేదు. ఇప్పుడు సెన్సార్ పూర్తైనా కూడా స‌గం సినిమాను లేపేసారు సెన్సార్ స‌భ్యులు. దానికి సంజ‌య్ లీలా భ‌న్సాలీ కూడా ఏం చేయ‌ల‌క‌పోతున్నాడు. ఇప్పుడు అంతా సిద్ధం సినిమాను విడుద‌ల చేసుకోండంటూ సెన్సార్ వాళ్లు చెబుతున్నా కూడా క‌ర్ణిసేన మాత్రం ఇప్ప‌టికీ ప‌ద్మావ‌తిపై క‌త్తులు నూరుతూనే ఉన్నారు. వీళ్లు ప‌ద్మావ‌తిని విడుద‌ల చేస్తే ఆ థియేట‌ర్స్ త‌గ‌ల‌బెట్టేస్తామ‌ని వార్నింగ్ ఇస్తున్నారు.
కొత్త విడుద‌ల తేదీని త్వ‌ర‌లోనే అనౌన్స్ చేస్తామంటున్నారు ద‌ర్శ‌క నిర్మాత‌లు. ఈ పాపం ఎవ‌రితో తెలియ‌దు కానీ అన్యాయం అయిపోయింది మాత్రం భ‌న్సాలీ అండ్ టీం. రాణి పద్మిని దేవి జీవిత చరిత్ర ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రంపై రాజ్ పుత్ కర్ణి సేన నుంచి బెదిరింపులు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా విడుదలైతే ఉత్తర ప్రదేశ్ లో శాంతి భద్రతల  విఘాతం కలుగుతుందని సాక్షాత్తూ ఆ రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి.. కేంద్రానికి లేఖ రాశారు. ఆ చిత్రంలో రాణి పద్మిని దేవిని కించపరిచేలా ఉన్న సన్నివేశాలు తొలగించేవరకు విడుదలను ఆపాలని రాజస్థాన్ సీఎం వసుంధర రాజే.. కేంద్ర‌ సమాచార ప్రసారాల శాఖ మంత్రి స్మృతి ఇరానీకి లేఖ రాశారు.
విడుద‌ల‌కు ముందే ఈ చిత్రాన్ని చూసేలా ప్రముఖ చ‌రిత్ర‌కారులు, ప‌లువురు సినీ ప్రముఖులు, రాజ్ పుత్ వర్గ ప్రముఖులతో ఓ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. అంతేకాదు సినిమా చూసిన త‌ర్వాత వాళ్ల‌తో చ‌ర్చించి అవ‌స‌ర‌మైన మార్పులు చేయాల్సిందిగా ఆ లేఖ‌లో కోరారు. సెన్సార్ బోర్డు కూడా ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని విడుదల తర్వాతి పర్యవసానాల్ని దృష్టిలో ఉంచుకుని పద్మావతిని రీసెన్సార్ చేయాలని రాజస్థాన్ సర్కార్ కోరుకుంటోంది. ప‌ద్మావ‌తి ర‌చ్చ గురించి తెలిసి.. ఆ చిత్ర నిర్మాణంలో భాగ‌స్వామి అయిన వయోకోమ్ 18 ప్రతినిధి ఒకరు విడుద‌ల‌ను అధికారికంగా ఆపిన‌ట్లు ప్ర‌క‌టించారు.
రాజ్ పుత్ ల రాజసం, గౌరవం ఇంకా పెరిగేలా.. ప‌ద్మావ‌తి దేవీ ప్ర‌తిష్ట పెంచేలా ఈ చిత్రాన్ని భ‌న్సాలీ తెర‌కెక్కించార‌ని.. ఏ వ‌ర్గాన్ని కించ‌ప‌రిచే ఉద్దేశం త‌మ‌కు లేద‌ని చెప్పారు నిర్మాత‌లు. త్వరలోనే ఆ చిత్ర విడుదలకు అవసరమైన అన్ని అనుమతులు లభిస్తాయనే న‌మ్మ‌కం త‌మ‌కు ఉంద‌న్నారు. అడ్డంకులు తొలగిపోయాక త్వరలోనే ఆ చిత్ర విడుదల తేదీని ప్రకటిస్తామని చెప్పారు. మొత్తానికి పాము ప‌గ కంటే మ‌నిషి ప‌గ బ‌డితే చాలా డేంజ‌ర్ అని ఇప్పుడు ప‌ద్మావ‌తి సినిమాతో మ‌రోసారి బ‌య‌ట‌ప‌డుతుంది. అన్యాయంగా బ‌లైపోతున్న ప‌ద్మావ‌తికి బాలీవుడ్ లోనే కాదు.. అన్ని ఇండ‌స్ట్రీల నుంచి కావాల్సినంత స‌పోర్ట్ ల‌భిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here