తెలుగు ఇండస్ట్రీలో అజ్ఞాతవాసి కంటే పెద్ద టాపిక్ ఉందా..? ఇప్పుడు ఇదే ఎక్కడ విన్నా చర్చ. ట్రైలర్ కు ఊహించినంత రెస్పాన్స్ రాకపోయినా.. పవన్ ఉన్నాడు కాబట్టి అంతా ఆయన చూసుకుంటాడులే అనుకుంటున్నారు అభిమానులు. ఇక ఈయనకు ప్రభుత్వాలు కూడా ఇప్పుడు తోడు నిలుస్తున్నాయి. ఎలాగూ పవన్ ఇటు అటు కావాల్సిన వాడే కావడంతో ఇద్దరు చంద్రులు ఈయనకు బాగానే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రలో 10 నుంచి 17 తారీఖు మధ్యలో అంటే సెలవులు ముగిసేవరకు రోజూ రాత్రి 1 నుంచి ఉదయం 10 గంటల మధ్యలో షోలు అదనంగా వేసుకోవచ్చని థియేటర్స్ కు పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం. ఇక తెలంగాణలోనూ ఓ షో అదనంగా వేసుకోవాలని పర్మిషన్ వచ్చేసింది. ఇదంతా చూస్తుంటే అజ్ఞాత వాసిని బయటపడేయటానికి చేస్తోన్న ప్రయత్నంలా కనిపిస్తుంది.
ఈ చిత్ర బిజినెస్ ఒకటి రెండుకాదు.. ఏకంగా 120 కోట్ల వరకు జరిగింది. అక్షరాలా 120 కోట్ల షేర్ వస్తే కానీ అజ్ఞాతవాసి సినిమాను హిట్ అనలేం. అంత రావాలంటే అద్భుతం చేయాల్సిందే.. సినిమా కూడా అద్భుతంగా ఉండాల్సిందే. మరో ఆప్షన్ కూడా లేదు. దానికి ఇప్పుడు ప్రభుత్వాలు కూడా తమదైన సాయం చేస్తున్నాయి. జనవరి 10న ఏ థియేటర్లో చూసినా మనకు అజ్ఞాత వాసి తప్ప మరో సినిమా కనిపించదు. అలా ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పుడు ఈ చిత్రంపై ఉన్న అంచనాలు చూస్తుంటే తొలిరోజు నాన్ బాహుబలి రికార్డులన్నీ బద్ధలవ్వడం ఖాయమైపోయింది. ముఖ్యంగా అన్నయ్య ఖైదీ నెం.150 పేరు మీదున్న 35 కోట్ల షేర్ తొలిరోజు రికార్డులను పవన్ కొల్లగొట్టేలా కనిపిస్తున్నాడు. బాహుబలి 2 మాత్రం తెలుగులో తొలిరోజు 43 కోట్ల షేర్ సాధించింది. అది సాధించడం మాత్రం చాలా కష్టం. మొత్తానికి ఎటు చూసుకున్నా సెలవులు ముగిసే ఏడు రోజుల్లో కనీసం 80 కోట్ల షేర్ రాబట్టాలనేది పవన్ ఆలోచనగా కనిపిస్తుంది. మరి ఇది ఎంత వరకు నెరవేరుతుందో చూడాలిక..!