ఈ రోజుల్లో ఓ ట్రైలర్ ను కోటి మంది చూడటం అంటే చిన్న విషయం కాదు. స్టార్ హీరోల సినిమాల ట్రైలర్లు చాలానే ఈ ఫీట్ అందుకుంటున్నాయి. కానీ ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయి ప్రభంజనం మాత్రం ఊహించడం ఆశ్చర్యమే. ఇప్పుడు ఇది చేసి చూపిస్తుంది అనుష్క. ఈ భామకు ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి బయటపడింది. ఈమె నటించిన భాగమతి ట్రైలర్ ఈ మధ్యే విడుదలైంది. ఇప్పుడు అది యూ ట్యూబ్ ను షేక్ చేస్తుంది. విడుదలైన ఆరు గంటల్లోనే 10 లక్షల వ్యూస్ దాటిన ఈ ట్రైలర్.. ఇప్పుడు 75 లక్షల మార్క్ అందుకుంది. ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాకు ఇది చాలా ఎక్కువ. ఈమె జోరు చూస్తుంటే త్వరలోనే కోటి మార్క్ కూడా అందుకునేలా కనిపిస్తుంది. ఇదే జరిగితే తెలుగులో అనుష్క చాలా రేర్ ఫీట్ అందుకున్నట్లే. ఈ చిత్రంపై అంచనాలు ఇప్పుడు భారీగా పెరిగిపోయాయి. అందరి చూపులు కూడా అనుష్కపైనే ఉన్నాయి. చాలా కాలం తర్వాత ఈమె చేసిన లేడీ ఓరియెంటెడ్ సినిమా కావడంతో అంచనాలు.. ఆసక్తి రెండూ పెరిగిపోతున్నాయి.
సాప్ట్ గా ఉండే అమ్మాయి పాత్రలో అనుష్క ఎంట్రీ ఇవ్వడం.. ఊరి కోసం మంచి చేయడం.. ఆ తర్వాత వెంటనే జైలుకు వెళ్లడం.. అక్కడ్నుంచి పాతబంగ్లాలో బంధించడం.. అక్కడ ఓ అదృశ్యశక్తి అనుష్కను వెంటాడటం.. ఇవన్నీ ఆసక్తి పుట్టించాయి. చివర్లో ఎవరు పడితే వారు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి ఇదేమైనా పశువుల దొడ్డా.. భాగమతి అడ్డా. లెక్కలు తేలాలి.. ఒక్కడ్నీ పోనివ్వనంటూ అనుష్క పలికిన డైలాగులు కేక పెట్టించాయి. ముఖ్యంగా ఆ గెటప్ సినిమాపై అంచనాలు పెంచేస్తుంది. మరోసారి అరుంధతి తరహాలోనే రెచ్చిపోయింది అనుష్క. పిల్ల జమీందార్ తర్వాత హిట్ లేని అశోక్ భాగమతిని ఏ విధంగా తెరకెక్కించి ఉంటాడో అనే ఆసక్తి మొదలైంది. దానికితోడు ఈయన గత సినిమా చిత్రాంగధ కూడా దెయ్యం సినిమానే. మరోసారి అలాంటి కాన్సెప్ట్ తోనే వస్తున్నాడు ఈ దర్శకుడు. మరి ఈ సారి ఏం మాయ చేసుంటాడో చూడాలి..!