నటీనటులు: రాజ్ తరుణ్, చిత్రాశుక్లా, సితార తదితరులు
సంగీతం : శ్రీచరణ్ పాకాల
సినిమాటోగ్రఫర్: ఎల్ కే విజయ్
నిర్మాత : అన్నపూర్ణ స్టూడియోస్
దర్శకురాలు: శ్రీరంజని
ఇండస్ట్రీలో ఎవరి జాతకం ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. హ్యాట్రిక్ కొట్టి.. ఇండస్ట్రీకి దూసుకుంటూ వచ్చిన రాజ్ తరుణ్.. ఇప్పుడు ఒక్క హిట్ అంటూ చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో ఆయన్నుంచి వచ్చిన సినిమా రంగుల రాట్నం. మరి ఇది రాజ్ తరుణ్ ఆశలను నిలబెట్టిందా..
కథ:
ఓ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ.. తల్లి(సితార) తో కలిసి ఆనందంగా ఉంటాడు విష్ణు (రాజ్ తరుణ్). తనకు అమ్మ, ఫ్రెండ్ శివ(ప్రియదర్శి) తప్ప ఎవరూ ఉండరు. విష్ణుకు ఎలాగైనా త్వరగా పెళ్లి చేయాలని వాళ్ల అమ్మ ప్రయత్నిస్తుంటుంది. ఈ ప్రయత్నాల్లో ఉండగానే విష్ణు జీవితంలోకి కీర్తి(చిత్రాశుక్లా) వస్తుంది. చూడగానే ప్రేమలో పడిపోతాడు. అన్నీ కుదిరి పెళ్లికి కూడా ఓకే అనుకునే లోపు విష్ణు వాళ్ల అమ్మ చనిపోతుంది. అదే సమయంలో ప్రేమించిన కీర్తి కూడా తనను వదిలేసి వెళ్లిపోతుంది. అసలు అమ్మ చనిపోయిన తర్వాత ఏమైంది.. ఎందుకు అంతగా ప్రేమించిన కీర్తి విడిపోతుంది..? అనేది మిగిలిన కథ..
కథనం:
సంక్రాంతికి చిన్న సినిమాలు వస్తే హిట్ అనే సెంటిమెంట్ కొన్నేళ్లుగా ఉంది. రంగులరాట్నం కూడా ఇదే నిజం చేస్తుందేమో అనే నమ్మకంతోనే ఉన్నారంతా. కానీ సెంటిమెంట్లు ప్రతీసారి వర్కవుట్ అవ్వవని అర్థమైంది. ఇప్పటికే ఎన్నోసార్లు వాడేసిన పాత కథనే మరోసారి చూపించారు రంగులరాట్నం టీం. సెంటిమెంట్ డోస్ కాస్త పెరిగితేనే సీరియల్ లా ఉందంటాం మనం. రంగులరాట్నంలో అలాంటి సీన్స్ చాలానే ఉన్నాయి.
అమ్మ సెంటిమెంట్ బాగానే వర్కవుట్ అయినా.. చాలా స్లోగా అనిపిస్తుంది. ప్రీ ఇంటర్వెల్ ముందు సీన్ మాత్రం బాగా పండింది. ముఖ్యంగా ఏ ట్విస్టులు లేకుండా సీరియల్ లా సాగుతుంది ఈ చిత్రం. దానికితోడు అమ్మా, కొడుకు మధ్య సీన్స్ రఘువరన్ బిటెక్ ను గుర్తు చేస్తాయి. ఫస్టాఫ్ అంతా అమ్మతో సీన్స్.. ఫ్రెండ్ తో తాగుడు సీన్స్.. హీరోయిన్ తో ట్రాఫిక్ సీన్స్ అంతా ఇంకేం కనిపించదు. రాజ్ తరుణ్, సితార మధ్య సీన్స్ బాగానే కుదిరాయి. ఇక హీరో అమ్మాయిని చూడటం.. ప్రేమలో పడటం.. ఆమె ఈవెంట్ మేనేజర్ గా పని చేస్తుందని తెలుసుకుని ఆమె కోసం ఏవేవో పార్టీలు పెట్టడం.. అందులో తన ప్రేమ కోసం పాకులాడటం.. ఇలాంటి సీన్స్ చాలా సినిమాల్లో ఇప్పటికే చూసాం. రంగుల రాట్నంలో కొత్తగా ఇవేం కనిపించవు. దానికితోడు కథ కూడా చాలా నెమ్మదిగా సాగుతుంది.
ఇంటర్వెల్ కు ట్విస్ట్ ఉండాలి కాబట్టి అమ్మ కారెక్టర్ కు తెర దించేసారు. ఆ ఒక్క సీన్ మాత్రం సినిమాలో చాలా బాగా పండింది. అమ్మ చనిపోయిన సీన్ లో రాజ్ తరుణ్ బాగా నటించాడు. మంచి సెంటిమెంటల్ సీన్ తో ఇంటర్వెల్ పడినా.. సెకండాఫ్ లో మాత్రం కథ మళ్లీ పాత ట్రాక్ లోనే వెళ్తుంది. ప్రేమను ఒప్పుకున్న హీరోయిన్.. తను ప్రేమించిన వాళ్లు ఎక్కడ దూరమైపోతారో అనే భయంతో హీరోను దూరం పెట్టడం అనేది అంత సాటిస్ ఫైయింగ్ గా అనిపించదు. తర్వాత మళ్లీ ఈజీగా కలిసిపోవడం.. ఇలా కన్ఫ్యూజింగ్ గా సాగుతుంది కథ. ఇక జాగ్రత్త పేరుతో అతిప్రేమ చూపించే హీరోయిన్.. అది టార్చర్ లా ఫీలయ్యే హీరో.. అయినా సరే.. ప్రేమించిన అమ్మాయి కోసం హీరో చేసే త్యాగాలు.. ఇవన్నీ పెద్దగా వర్కవుట్ కాలేదేమో అనిపించింది. కథ పాతదే అయినపుడు.. స్క్రీన్ ప్లేతో మాయ చేస్తారు దర్శకులు.. కానీ రంగులరాట్నం విషయంలో ఆ మ్యాజిక్ మిస్ అయింది.
నటీనటులు:
రాజ్ తరుణ్ అనగానే మనకు ఓవర్ యాక్షన్ గుర్తొస్తుంది. అవసరం ఉన్నా లేకపోయినా హైపర్ గా మారిపోతుంటాడు ఈ కుర్ర హీరో. కానీ ఈ సినిమాలో మాత్రం చాలా సెటిల్డ్ గా కనిపించాడు. ఇక చిత్రాశుక్లా సినిమా అంతా ఒకటే ఎక్స్ ప్రెషన్ క్యారీ చేసింది. హీరో తల్లిగా సితార చాలా బాగా నటించింది. ఆమె ఉన్న సీన్స్ బాగానే వర్కవుట్ అయ్యాయి. హీరో ఫ్రెండ్ గా ప్రియదర్శి చాలా వరకు నవ్వించాడు. ఆయన సీన్స్ బాగున్నాయి. మిగిలిన వాళ్లంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే బ్యాచ్.
టెక్నికల్ టీం:
శ్రీచరణ్ పాకాల సంగీతం పర్లేదు. ఆర్ఆర్ కూడా బాగానే ఇచ్చాడు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింట్ బాగానే అనిపించింది. కానీ కొన్ని సీన్స్ చాలా స్లోగా వెళ్తున్న ఫీలింగ్ కలుగుతుంది. విజయ్ సినిమాటోగ్రఫీ ఓకే. ఆయనకు ఉన్న బడ్జెట్ లో చాలా చక్కటి ఔట్ పుట్ ఇచ్చాడు. దర్శకురాలు శ్రీరంజని కథ విషయంలో అప్ డేట్ కాలేదు. చాలా సార్లు చెప్పిన కథనే మళ్లీ ఎంచుకుంది. దానికి తోడు గురువు సెల్వ రాఘవన్ స్టైల్ ఎక్కువగా కనిపించింది ఈ చిత్రంలో. మొత్తంగా రంగుల రాట్నం ఈమెకు డ్రీమ్ డెబ్యూ అయితే కాదు.
చివరగా:
రంగులరాట్నంలో రంగులు సరిపోలేదు.. కథ కంచికే..