అవును.. మీరు చూస్తున్నది కరెక్టే.. అఖిల్ తో ప్రభాస్ నిజంగానే చేయబోతున్నాడు. అయితే ఇక్కడే చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పుడు అఖిల్ చాలా అంటే చాలా మారిపోయాడు. మూడేళ్ల కింద అఖిల్ ఇలా లేడు. మాస్ వైపు అడుగులు వేస్తూ లేనిపోని ఇమేజ్ కోసం ప్రయత్నాలు చేసిన అఖిల్ మనకు కనిపిస్తాడు. కానీ ఇప్పుడు మనోడు చాలా మారిపోయాడు. మనకు ఏం కావాలో ఒక్కోసారి మనకంటే మనకు కావాల్సిన వాళ్లకే ఎక్కువగా తెలుస్తాయి. అఖిల్ విషయంలో నాగార్జున ఇదే చేస్తున్నాడు. ఈయన తన తనయున్ని క్లాస్ హీరోగా చూడాలనుకుంటున్నాడు. అందమైన ప్రేమకథల్లో నటిస్తే బాగుంటుందనుకున్నాడు. ఇప్పుడు అఖిల్ కూడా తండ్రి లాగే ఆలోచిస్తున్నాడు. ఇకపై కథ కొత్తగా ఉంటే చాలు.. మాస్ ఇమేజ్ అవసరం లేదనుకుంటున్నాడు ఈ హీరో. అందుకు తగినట్లుగానే ఇప్పుడు ఓ కొత్త దర్శకుడికి అవకాశం ఇస్తున్నాడు అఖిల్. అసలు ఎవరూ ఊహించని విధంగా అఖిల్ మూడో సినిమా కోసం ఓ దర్శకుడు లైన్ లోకి వచ్చాడు.
అతడే సత్యప్రభాస్ పినిశెట్టి. రవిరాజా పినిశెట్టి కొడుకు.. హీరో ఆది పినిశెట్టి అన్నయ్య ఈయన. ఇదివరకు తమ్ముడుతో మలుపు సినిమా చేసాడు సత్య. అది యావరేజ్ గా ఆడింది. ఇప్పుడు ఈయన అఖిల్ కు ఓ కథ చెప్పాడు. అది సిసింద్రీకి కూడా బాగా నచ్చింది కూడా. ఇప్పుడు ఈ చిత్రం పట్టాలెక్కడానికి రెడీ అవుతుంది. జనవరి 10 తర్వాత తన అభిప్రాయం చెప్తానని చెప్పిన అఖిల్.. ఆ మాట నిలబెట్టుకోలేకపోయాడు కానీ సినిమా అయితే చేస్తున్నాడు. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ చిత్రానికి నిర్మాత రానా. అవును.. అక్కినేని వారసుడతో దగ్గుపాటి వారసుడు నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నాడు. మొత్తానికి అప్పుడు నితిన్ తో.. ఇప్పుడు రానాతో.. ఇలా హీరోలందర్నీ నిర్మాతలుగా మార్చేస్తున్నాడు అఖిల్. అలా హీరో ప్రభాస్ తో కాకపోయినా.. దర్శకుడు సత్యప్రభాస్ తో ఈయన సినిమా చేయబోతున్నాడు. మరి చూడాలిక మూడో సినిమాతో అఖిల్ కెరీర్ ఎలాంటి మలుపు తిరుగుతుందో..?