ఎంత బాధపడితే ఏం లాభం..? అభిమానులు ఏం చేసినా.. ఎంత చేసినా దేవున్ని ప్రార్థించడం వరకే. అసలు చేయాల్సిందంతా విక్రమే కదా. ఈయన కెరీర్ ఇప్పుడు ఎటు వెళ్తుందో తెలియని నావలా మారిపోయింది. ఏ హీరోకైనా ఒక్క ఏడాది.. రెండేళ్లు బ్లాక్ బస్టర్ లేకుండా ఉంటాడు. కానీ విక్రమ్ కు మాత్రం 13 ఏళ్లుగా బ్లాక్ బస్టర్ లేదు. 2005లో వచ్చిన అపరిచితుడు తర్వాత ఇప్పటి వరకు మళ్లీ ఆ స్థాయి విజయం రాలేదు. మధ్యలో కొన్ని సినిమాలు వచ్చినా కూడా అవి యావరేజ్.. హిట్ అనిపించుకున్నాయే కానీ బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు. దైవతిరుమగన్.. ఐ.. ఇరుముగన్ లాంటి సినిమాలు కమర్షియల్ గా సేఫ్ అయ్యాయంతే.
మొన్న సంక్రాంతికి స్కెచ్ సినిమాతో వచ్చాడు. ఈ సినిమా కూడా అంచనాలు అందుకోలేకపోయింది. విజయ్ చందర్ తెరకెక్కించిన ఈ చిత్రం సూర్య తాన సేరంద కూట్టం ముందు నిలబడలేకపోయింది. తొలివారంలో కనీసం 30 కోట్లు కూడా వసూలు చేయ లేకపోయింది స్కెచ్. విక్రమ్ లాంటి హీరో కూడా రొటీన్ కథలకు అలవాటు పడటం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. మొన్నొచ్చిన స్కెచ్ అలాంటిదే. కళైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రాన్ని విజయ్ చందర్ తెరకెక్కించాడు. విక్రమ్ ట్రాక్ రికార్డ్ తో పనిలేకుండా స్కెచ్ కోసం 50 కోట్లకు పైగానే బడ్జెట్ పెట్టారు. ఇప్పుడు ఇదంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. పరిస్థితి చూస్తుంటే సినిమాకు దారుణమైన నష్టాలు తప్పేలా లేవు. అయితే ఈ సినిమా ఫ్లాప్ అయినా కూడా ప్రస్తుతం సామి 2.. ధృవనక్షత్రంతో పాటు మహావీర కర్ణ సినిమాతో బిజీగా ఉన్నాడు విక్రమ్. ఇవన్నీ ఇప్పుడు విక్రమ్ కెరీర్ కు అండగా నిలుస్తాయో లేదో చూడాలిక..!