అవును.. ఇప్పుడు ఇండస్ట్రీలో జరుగుతున్నది చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. కచ్చింతగా సాయికొర్రపాటి మరో అశ్వినీదత్ లా మారిపోతున్నాడు. దానికి కొన్ని పోలికలు కూడా ఉన్నాయి. కొన్నేళ్ల కింది వరకు ఇండస్ట్రీలో అశ్వినీదత్ కు మంచి ఇమేజ్ ఉంది. ఇప్పుడు కూడా ఆయనకు లెజెండరీ నిర్మాత అనే హోదా ఉంది. ఆయన బ్యానర్ కు 40 ఏళ్ల చరిత్ర ఉంది. దర్శకులకు ఎంత డిమాండ్ ఉండేదో.. అశ్వినీదత్ కు కూడా అంతే ఇమేజ్ ఉండేది. ఆయన బ్యానర్ లో పనిచేయని హీరో లేడు ఇండస్ట్రీలో. ముఖ్యంగా అశ్వినీదత్ చేయి పడితే ఏ వారసుడు అయినా స్టార్ అయిపోతాడు అనే సెంటిమెంట్ ఉంది. అందుకే ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ సొంత బ్యానర్స్ ఉన్నా కూడా తమ వారసులను తీసుకెళ్లి అశ్వినీదత్ చేతిలో పెట్టారు.
చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ను చిరుతతో.. కృష్ణ వారసుడు మహేశ్ ను రాజకుమారుడితో.. బన్నీని గంగోత్రితో.. నారా రోహిత్ ను బాణం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసాడు అశ్వినీదత్. ఇప్పుడు అంతా బాగానే ఉన్నారు. ఇలాంటి సెంటిమెంట్స్ ఇప్పుడు సాయికొర్రపాటి తీసుకుంటున్నాడు. ఈయన వారసులను పరిచయం చేసే కార్యక్రమం పెట్టుకుంటున్నాడు. ఇప్పటికే మోక్షజ్ఞను పరిచయం చేస్తానని చెప్పాడు సాయి కొర్రపాటి. బాలయ్య తనయుడు ఎప్పుడు హీరో అయినా తొలి సినిమా తనదే అంటున్నాడు ఈ నిర్మాత. ఇకిప్పుడు మెగా అల్లుడు కళ్యాణ్ ను కూడా ఈ నిర్మాతే హీరోగా పరిచయం చేస్తున్నాడు. ఈ సినిమాకు ఓపెనింగ్ కూడా పెట్టేసారు దర్శక నిర్మాతలు. జతకలిసే ఫేమ్ రాకేష్ శశి ఈ చిత్రానికి దర్శకుడు. ఆయనకు తోడు మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను కూడా ఈ నిర్మాతే తీసుకుంటున్నాని తెలుస్తుంది. మొత్తానికి సాయికొర్రపాటి ఇప్పుడు మరో అశ్వినీదత్ లా మారిపోతున్నాడు.