మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి అల్లుడు కూడా హీరో కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. మా హీరోలంతా కలిస్తే ఓ క్రికెట్ టీం కు సరిపోతుంది. ఆ మధ్య వరుణ్ తేజ్ ఓ ఫంక్షన్ లో సరదాగా అన్న మాటిది. కానీ ఇప్పుడు అదే నిజమైంది కూడా. నిజంగానే మెగా ఫ్యామిలీ నుంచి 11 మంది వచ్చారు ఇండస్ట్రీకి. ఇదే ఇప్పుడు అంతా హాట్ టాపిక్. అసలు ఓ కుటుంబం నుంచి ఇంతమంది హీరోలు రావడం బహుశా ప్రపంచంలోనే ఎక్కడా జరుగుండదేమో..? ఒకటి.. రెండు.. మూడు.. నాలుగు.. ఐదు.. ఆరు.. ఏడు.. ఎనమిది.. తొమ్మిది.. పది.. అంటూ లెక్క పెట్టుకుంటూనే వెళ్తున్నారు మెగా హీరోలు. ఒక్క ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు రావడం.. దాదాపు అందరూ క్లిక్కవ్వడం అనేది బహుశా ప్రపంచ సినిమా ఇండస్ట్రీలో ఎక్కడా జరగలేదేమో..! చిరంజీవి మెగా ఫ్యామిలీకి ఆద్యుడు. మెగాస్టార్ గా మూడు దశాబ్దాల పాటు తెలుగు తెరను ఏలారాయన. ఇప్పటికీ ఆయన సినిమా వస్తే రికార్డులు బద్దలైపోతున్నాయి. ఈయన పేరు చెప్పుకుని వచ్చిన నాగబాబు హీరోగా నిలబడకపోయినా.. కారెక్టర్ ఆర్టిస్టుగా నిలదొక్కుకున్నారు.
ఇక అన్న చాటు తమ్ముడిగా 20 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చాడు పవన్ కళ్యాణ్. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయితో ప్రస్థానం మొదలుపెట్టి.. అనతి కాలంలోనే అన్నను మించిన తమ్ముడిగా మారాడు. ఇప్పుడు టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ది ఓ స్పెషల్ జర్నీ. ఆయనదో సపరేట్ స్టైల్. పవన్ అంటే ఇప్పుడు ఓ శిఖరం. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి పేరు చెప్పుకుని వచ్చిన మరో ఇద్దరు స్టార్ హీరోలు రామ్ చరణ్, అల్లుఅర్జున్. ఈ ఇద్దరూ ఇప్పటి కుర్ర హీరోల్లో టాప్ పొజిషన్ ఎంజాయ్ చేస్తున్నవారే. పవన్, చరణ్, బన్నీ ముగ్గురికీ 80 కోట్ల మార్కెట్ ఉండటం ఇక్కడ మరో విశేషం. ఇప్పుడు బన్నీ 100 కోట్ల వైపుగా అడుగేస్తున్నాడు.
ఈ మధ్యే మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో ముగ్గురు కుర్రాళ్లు వరుణ్ తేజ్, సాయిధరంతేజ్, అల్లుశిరీష్. వీళ్లలో శిరీష్ ఇంకా చిన్న హీరోగానే ఉన్నాడు. ఈయనకు సరైన మార్కెట్ రాలేదు. కానీ నిలబెట్టే ప్రయత్నాలైతే జరుగుతున్నాయి. ఇక మెగా మేనల్లుడు సాయిధరంతేజ్ కొత్తలోనే సంచలనాలు సృష్టించాడు. పిల్లా నువ్వులేని జీవితం,సుబ్రమణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలతో సాయి ఇమేజ్ పెరిగిపోయింది. ఈ మధ్య వరసగా ఫ్లాపులు వచ్చినా కూడా మనోడికి క్రేజ్ అయితే తగ్గలేదు. ప్రస్తుతం వినాయక్ ఇంటిలిజెంట్ సినిమాతో ఫామ్ లోకి రావాలని చూస్తున్నాడు. ఇక వరుణ్ తేజ్ గతేడది ఫిదాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఇప్పుడు తొలిప్రేమ అంటూ వస్తున్నాడు.
వీళ్లు చాలరన్నట్లు కొణిదెల నిహారిక సైతం ఒక మనసుతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మెగా ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు ఉండగానే ఇప్పుడు మరో ఇద్దరు హీరోలు వస్తున్నారు. వాళ్లు మరెవరో కాదు.. సాయిధరంతేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్.. మరొకరు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్. వీళ్లలో వైష్ణవ్ ప్రస్తుతం తన చదువుకు కొనసాగిస్తూ నటన, డాన్స్, ఫైట్స్ ఇలా వివిధ కేటగిరీల్లో శిక్షణ పొందుతున్నాడు. మరో ఆలోచన లేకుండా ఫ్యూచర్ లో హీరో అవ్వాలని ఫిక్సైపోయాడు ఈ చిన్న తేజ్. ఇక మావ అండతో కళ్యాణ్ సైతం నటన వైపు అడుగేస్తున్నాడు. ఈయన తొలి సినిమా ఓపెనింగ్ కూడా జరిగిపోయింది. సాయి కొర్రపాటి మెగా అల్లున్ని ఇండస్ట్రీకి తీసుకొస్తున్నాడు. చూస్తుంటే.. ఒకే ఫ్యామిలీ నుంచి ఇంతమంది హీరోలు రావడం కూడా మంచిది కాదనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి.