అవును.. ఇన్నాళ్లూ పక్క ఇండస్ట్రీలోనే ఉన్న ఈ హీరో ఇప్పుడు తెలుగులోకి కూడా వస్తున్నాడు. ఇప్పటికే కొన్ని డబ్బింగ్ సినిమాలతో అదృష్టాన్ని పరీక్షించుకున్న ధనుష్.. ఇప్పుడు నేరుగా తెలుగు సినిమా చేస్తున్నాడు. దీనికి ముహూర్తం కూడా ఫిక్స్ అయిపోయింది. నిర్మాత కూడా సై అనేసాడు. అసలు ధనుష్ కెరీర్ జర్నీ చూసి అంతా షాక్ అవుతున్నారు. ఈయన ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా విమర్శలే వచ్చాయి. చూడ్డానికి బక్కగా ఉన్నాడు.. ఇతడు హీరో ఏంటి.. అసలు ఇలాంటి వాళ్లు హీరో అవుతారా అంటూ చాలా విమర్శలే ఎదుర్కున్నాడు ధనుష్. కానీ అన్నింటి మధ్య బాగా రాటుదేలాడు. ఒక్కసారి సక్సెస్ అందుకున్న తర్వాత తిట్టిన నోళ్లతోనే పొగిడించుకున్నాడు ధనుష్.
ఈ మధ్య కాలంలో సరైన హిట్ లేక అల్లాడిపోతున్నాడు ఈ హీరో. వరసగా వచ్చిన సినిమాలు వచ్చినట్లు పరాజయం పాలవుతున్నాయి. ఆ మధ్య వచ్చిన విఐపి 2 కూడా పెద్దగా ఆడలేదు. తన దర్శకత్వంలో తెరకెక్కిన పవర్ పాండి సైతం అబౌ యావరేజ్ అయింది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ తో ఓ సినిమా చేస్తున్నాడు ధనుష్. పవర్ పాండి తర్వాత దర్శకుడిగా సైలెంట్ అయిపోయిన ధనుష్.. రెండో సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు. తొలి ప్రయత్నం చిన్న బడ్జెట్ తో చేసిన ధనుష్.. ఈ సారి కొంచెం పెద్దగా ప్రయత్నిస్తున్నాడు. ఇదొక చారిత్రాత్మక చిత్రం. మెర్సల్ ఫేమ్ తెండ్రాల్ ఫిలిమ్స్ సంస్థ ఈ భారీ సినిమాను అంతే బడ్జెట్లో నిర్మించనుంది. ఇందులో ధనుష్ నటిస్తూ దర్శకత్వం వహించనున్నాడు.
ఈయనతో పాటు మరో హీరో కూడా ఈ చిత్రంలో ఉంటాడు. 2018 ద్వితీయార్ధంలో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. ఇక ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీకి కూడా వస్తున్నాడు ధనుష్. పివిపి నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రస్తుతం గౌతమ్ మీనన్ ఎన్నై నొక్కి పాయుం తోటాతో పాటు వాడా చెన్నై.. హాలీవుడ్ మూవీ ది ఎక్స్ ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకిర్ లో నటిస్తున్నాడు. వీటితోపాటే బాలాజీ మోహన్ తో మారి 2 లోనూ నటిస్తున్నాడు. సాయిపల్లవి ఇందులో హీరోయిన్. ఇవన్నీ పూర్తైన తర్వాత తెలుగు సినిమా ఉండబోతుంది.