ఈ రోజుల్లో ఓ సినిమా ఫ్లాప్ అయితే దర్శకున్ని నిందిస్తారు.. హీరోను నిందిస్తారు.. కానీ ఆ కథ రాసిన రచయితను మాత్రం ఎవరూ ఏం అనరు. ఎందుకంటే అతనెప్పుడూ ఫోకస్ లో ఉండడు కాబట్టి. కానీ కొన్ని సినిమాల ఫెయిల్యూర్స్ బాధ్యత మాత్రం కచ్చితంగా రచయితలే తీసుకోవాలి. ఎందుకంటే వాళ్లు అప్పటికే స్టార్ రైటర్లు కాబట్టి. ఇప్పుడు టచ్ చేసి చూడుకు కూడా అంతే. ఈ చిత్రానికి కథ అందించింది వక్కంతం వంశీ. ఈయన కొన్నేళ్లుగా ఇండస్ట్రీలో ఉన్నారు. ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలకు కథలు అందించారు. తాజాగా నా పేరు సూర్యతో దర్శకుడిగా కూడా మారాడు. ఈ సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నాడు వంశీ. ఈ హడావిడిలో ఉన్నపుడే రవితేజ సినిమాకు కథ అందించాడు వంశీ. ఆ తర్వాత మళ్లీ అటు వైపుగా కూడా చూడలేదని.. మొత్తం భారమంతా కొత్త దర్శకుడు విక్రమ్ సిరిపైనే వేసాడని తెలుస్తుంది. అందుకే టచ్ చేసి చూడు టచ్ చేయలేని విధంగా మారిపోయిందనే రూమర్లు ఉన్నాయి. ఇదంతా తెలిసే టచ్ చేసి చూడును కొన్నాళ్లు రవితేజ పక్కనబెట్టాడు. ఆ మధ్య రాజా ది గ్రేట్ పూర్తైన తర్వాత కానీ మళ్లీ టచ్ చేసి చూడును టచ్ చేయలేదు మాస్ రాజా. మరి ఇప్పుడు ఈ సినిమా ఫలితానికి ఎవరు బాధ్యత వహిస్తారో..? పట్టించుకోని వక్కంతం వంశీనా.. తెలిసి తెలిసి పాత కథ చేసిన రవితేజనా..? ఇప్పుడు తప్పు ఎవరిదైనా ఫలితం మోసేది మాత్రం బయ్యర్లే కదా..!