ఆకాశంలో చందమామ రాడని తెలుసు.. తెలిసినా పిల్లాడి ఏడుపు ఆపడానికో.. అన్నం తినిపించడానికో అమ్మ అబద్ధం చెబుతుంది. ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ దీపిక పదుకొనే కూడా ఇలాంటి అబద్ధాలే చెబుతుంది. పైకి సీరియస్ గా నిజమే చెబుతున్నామనే కటింగ్ ఇస్తుంది గానీ అమ్మడి లోపలి ఫీలింగ్స్ మాత్రం బయటికి కనిపించేస్తున్నాయి. ఈ మధ్యే జరిగిన ఓ ఈవెంట్ కి వచ్చిన దీపిక తెలుగు ఇండస్ట్రీపై మనసులో మాట బయట పెట్టింది. తెలుగులో నటిస్తానంటూ ఓపెన్ ఆఫర్ ఇచ్చింది.
దీపిక ఇచ్చిన ఈ ఆఫర్ కు ఇప్పుడు నిర్మాతల గుండెలు జారిపోతున్నాయి. అమ్మాయిగారు బాలీవుడ్ లో ఒక్కో సినిమాకు 13 కోట్లకు పైనే తీసుకుంటారు. మరి టాలీవుడ్ లో అంతిచ్చి దీపికను హీరోయిన్ గా తీసుకునే గట్స్ ఉన్న నిర్మాత ఎవరైనా ఉన్నారా..? అంత రిస్క్ చేసే మొనగాడు కనిపిస్తాడా..? ఆ మధ్య రజినీకాంత్ కొచ్చాడయాన్ లో రెండ్రోజుల షూట్ కి వచ్చినందుకే 3 కోట్ల పారితోషికం తీసుకుంది దీపిక పదుకొనే. ఇక ఇప్పుడు ఫుల్ సినిమాలో హీరోయిన్ అంటే ఏకంగా నిర్మాతల ఆస్తి రాసిచ్చేయమనదూ..!
ఏదో అప్పటికప్పుడు తప్పించుకోడానికి చెప్పే మాటలు కాకపోతే.. అసలు ఈ బాలీవుడ్ భామలకు తెలుగులో నటించాలనే ఉద్దేశ్యమే లేనట్లు కనిపిస్తుంది. కత్రినాకైఫ్ నే తీసుకోండి. క్రేజ్ లేని రోజుల్లో వెంకటేశ్, బాలయ్యతో ఆడిపాడింది. ఇప్పుడు నటిస్తావా అంటే నిర్మాతలు నన్ను భరించలేరు అంటూ డైరెక్ట్ గా చెప్పేసింది. దీపిక కూడా అంతే. తెలుగులో మహేశ్ బాబు అంటే చాలా ఇష్టం.. పవన్ తో నటిస్తా.. ఇలా స్టేట్ మెంట్లు మాత్రమే ఇస్తుంది. దాన్ని ఆచరణలో పెట్టాలంటే నిర్మాతల ఆస్తులు కరగాలి. అది జరగదు.. అందుకే ఇదీ జరగదు. ఇప్పుడు చెప్పండి.. దీపిక తెలుగులో నటిస్తాననడం జోక్ ఆఫ్ ద ఇయర్ కాదంటారా..? పైగా పద్మావతి లాంటి సినిమా తర్వాత దీపిక రేంజ్ ఆకాశానికి ఎదిగిపోయిందంతే..!