తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది విలన్లు అయినా ఉండొచ్చు కానీ మోహన్ బాబు లాంటి విలన్ మాత్రం మళ్లీ రాడు.. లేడు.. రాబోడు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే విలన్ కు కూడా ఓ స్టైల్.. మేనరిజమ్స్ అలవాటు చేసిన నటుడు ఒక్క మోహన్ బాబు మాత్రమే. హీరో అయిన తర్వాత ఈయన విలనిజాన్ని చూసే భాగ్యం ప్రేక్షకులకు మిస్ అయిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు ఈయనలోని విలనిజం చూడబోతున్నారు ప్రేక్షకులు. ఈ మధ్య ప్రతీ హీరో తన సినిమాలో తానే విలన్ గా నటిస్తుండటం ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కలెక్షన్ కింగ్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన హీరోగా వస్తోన్న గాయత్రిలో విలన్ గా కూడా ఆయనే నటిస్తున్నాడు. అసలు సినిమా టైటిల్ పేరు విలన్ కు పెట్టిందే. గాయత్రి పటేల్ గా నట విశ్వరూపం చూపించడానికి వస్తున్నాడు ఈ హీరో.
90ల్లో మోహన్ బాబు సినిమా వస్తుందంటే చాలా అంచనాలుండేవి. కానీ కాలం మారిపోవడంతో ఆయన కూడా సినిమాలు తగ్గిస్తూ వచ్చారు. గత కొన్నేళ్లుగా ఆయన సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అప్పుడెప్పుడో అల్లరి నరేష్ తో ఓ సినిమా చేసిన మోహన్ బాబు.. ఇన్నాళ్లకు మళ్లీ గాయత్రి అంటూ వస్తున్నారు. ముందు ఈ చిత్రంపై కూడా ఎవరికీ పెద్దగా అంచనాల్లేవు. కానీ ఇప్పుడు సినిమాను లైట్ తీసుకుంటే మాత్రం నష్టం దారుణంగా ఉంటుంది. ఎందుకంటే కలెక్షన్ కింగ్ ఈ సారి ఏదో చేస్తున్నాడు. చాలా సీరియస్ గా కుమ్మేయడానికి వస్తున్నాడు. ఈ మధ్యే విడుదలైన ట్రైలర్ కానీ.. పాటలు కానీ గాయత్రిపై అంచనాలు భారీగా పెంచేసాయి.
పురాణాలపై డైలాగులు చెప్పి అలరించాడు మోహన్ బాబు. ముఖ్యంగా ఇటు భారతం.. అటు రామాయణంను స్పృషించాడు మోహన్ బాబు. అప్పుడు రాముడు చేసింది తప్పైతే.. ఇప్పుడు నేను చేసింది కూడా తప్పే అంటూ తన బేస్ వాయిస్ తో బెదరగొట్టాడు మోహన్ బాబు. ఇక ట్రైలర్ లో అయితే మోహన్ బాబు రచ్చ మాటల్లో చెప్పడం కష్టమే. ఈ చిత్రం కచ్చితంగా తనకు సెకండ్ ఇన్నింగ్స్ అవుతుందని.. మరీ ముఖ్యంగా ఇది అసెంబ్లీ రౌడీ రేంజ్ స్క్రిప్ట్ అంటున్నాడు మోహన్ బాబు. మదన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. ఆ రోజు సాయిధరంతేజ్ ఇంటిలిజెంట్ విడుదల కానుంది. అయితే తనకు తన సినిమా తప్ప మరో సినిమాతో పోటీ లేదంటున్నాడు మోహన్ బాబు. అన్నట్లు ఫిబ్రవరి 10న తొలిప్రేమ కూడా విడుదల కానుంది. మరి చూడాలిక.. మోహన్ బాబు ఇన్నేళ్ళ తర్వాత మళ్లీ విలనిజం ఎలా పండించబోతున్నాడో..?