ఈ రోజుల్లో ఒక్క హిట్ కొడితేనే అంతెత్తు ఎగురుతుంటారు దర్శకులు. అలాంటిది ఎన్టీఆర్ ను మూడు డిఫెరెంట్ కారెక్టర్స్ లో ప్రజెంట్ చేసి.. ఔరా అనిపించిన దర్శకుడు బాబీ ఉరఫ్ కేఎస్ రవీంద్ర. గతేడాది జై లవకుశతో చిన్నసైజ్ సంచలనం సృష్టించాడు ఈ దర్శకుడు. కమర్షియల్ గా ఈ చిత్రం బ్లాక్ బస్టర్ కాలేదు కానీ దర్శకుడిగా మాత్రం బాబీకి చాలా మంచి పేరు తీసుకొచ్చింది. జై లవకుశ తర్వాత బాబీ కోసం క్యూ కడతారేమో స్టార్ హీరోలు.. నిర్మాతలు అనుకున్నారంతా. కానీ సీన్ చూస్తుంటే రివర్స్ లో ఉంది. ఆయన్ని కావాలనే పక్కన బెడుతున్నారా లేదంటే పట్టించు కోవట్లేదో తెలియట్లేదు. ఈయన చేసింది మూడు సినిమాలు.. మూడు స్టార్ హీరోలతోనే. అందులో సర్దార్ ఫ్లాప్ అయినా.. పవర్, జై లవకుశ ఓకే అనిపించాయి. ముఖ్యంగా జై లవకుశ అయితే ఇండస్ట్రీ మొత్తాన్ని ఊపేసిన సినిమా.
సర్దార్ టైమ్ లో పవన్ పుణ్యమా అని బాబీని పూర్తిగా పక్కనబెట్టేసారు. అందుకే ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా బాబీ ఇమేజ్ పెద్దగా దెబ్బ తినలేదు. జై లవకుశతో తానేంటో నిరూపించుకున్నాడు. పెద్దగా కొత్త కథ కాకపోయినా.. రొటీన్ కథతో జై లవకుశ సినిమాను బాబీ హ్యాండిల్ చేసిన తీరు అందరితోనూ ప్రశంసల వర్షం కురిపించేలా చేస్తుంది. ముఖ్యంగా జై పాత్రను బాబీ తెరకెక్కించిన విధానం అద్భుతమే. ఈ మధ్య కాలంలో ఇంత పవర్ ఫుల్ కారెక్టర్ ఎవరూ రాయలేదు. పవర్ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ.. రెండో సినిమాకే పవర్ స్టార్ ను డైరెక్ట్ చేసాడు. కానీ సర్దార్ గబ్బర్ సింగ్ డిజాస్టర్. దాంతో బాబీ కూడా అందరి లాంటి దర్శకుడే అనుకున్నారు. అయితే అందర్నీ ఆశ్చర్యపరుస్తూ డిజాస్టర్ తర్వాత కూడా ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోతో జై లవకుశ లాంటి ఆఫర్ పట్టేసాడు.
ఈ చిత్రం ఇంతగా ఇంపాక్ట్ చూపించిన తర్వాత కూడా బాబీని స్టార్ హీరోలు పట్టించుకోవడం లేదు. ఇప్పటి వరకు మరో సినిమాపై వార్తలే రావడం లేదు. బాబీ టాలెంట్ ను కొందరు దోచేస్తున్నారనే టాక్ కూడా ఇండస్ట్రీలో వినిపిస్తుంది. కోనవెంకట్ లాంటి స్క్రీన్ ప్లే రైటర్స్ బాబీని ఔట్ ఫోకస్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. మొన్న జై లవకుశ టైమ్ లో దర్శకుడు బాబీ కంటే అన్నిచోట్లా కోనవెంకటే కనిపించాడు. ఇక ఎన్టీఆర్ కూడా ఈ చిత్రానికి కోన బ్యాక్ బోన్ అన్నాడు. బాబీకి సక్సెస్ కొట్టడం తెలిసినా.. దాన్ని క్యాష్ చేసుకునే పద్దతి ఇంకా అబ్బలేదంటారు ఇండస్ట్రీలో కొందరు.
పోసాని లాంటి వాళ్లైతే నేరుగానే బాబీకి చెప్పారు.. ఇంత మెతక్కా ఉంటే ఇండస్ట్రీలో ఎప్పటికీ స్టార్ డైరెక్టర్ వు కాలేవని. జై లవకుశ సక్సెస్ క్రెడిట్ ను కోన వాడుకుంటున్నాడు కానీ బాబీ మాత్రం ఊహించినంతగా వాడుకోవడం లేదు. మీ పేరును ఏడాది పాటు వాడుకుంటాను అంటూ అప్పట్లో ఎన్టీఆర్ కు చెప్పినా అది మాత్రం ఇప్పుడు జరగడం లేదు. అంతేకాదు.. బాబీకి టాలెంట్ ఉంది కానీ స్టార్ డైరెక్టర్ మాత్రం జీవితంలో కాలేడని ఇండస్ట్రీలో వరస విజయాలతో దూసుకు పోతున్న ఓ పెద్ద నిర్మాత అత్యంత సన్నిహితులతో అన్నాడనే వార్తలున్నాయి. మరి చూడాలిక.. బాబీ ఈ మైనస్ లను ఎప్పటికి అధిగమిస్తాడో..?