ఒక్కోసారి అంతే.. అదృష్టం కలిసొస్తే అలాగే ఉంటుంది. ఇప్పుడు నాగశౌర్యను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈ వారం మూడు సినిమాలొచ్చాయి కదా.. కచ్చితంగా ఛలో దారులు మూసుకుపోతాయి అనుకున్నారంతా. కానీ ఈ వారం వచ్చిన సినిమాల్లో ఒక్క తొలిప్రేమ మాత్రం వసూళ్ల వర్షం కురిపిస్తుంది. గాయత్రితో పాటు ఇంటిలిజెంట్ కూడా పెద్దగా ప్రభావం చూపించట్లేదు. దాంతో తొలిప్రేమ తర్వాత బెస్ట్ ఆప్షన్ అందరికీ ఇప్పుడు ఛలోనే కనిపిస్తుంది. అందుకే రెండో వారంలోనూ ఈ చిత్ర వసూళ్లు భారీగా ఉన్నాయి. ఇప్పటికే ఛలో ఖాతాలో 9 కోట్ల షేర్ పడిపోయింది. ఈ చిత్రాన్ని అమ్మింది మాత్రం 6 కోట్లకే. అంటే ఇప్పటికే బయ్యర్లకు 3 కోట్లు లాభం. మరో రెండు కోట్లు ఈజీగా వచ్చేలా కనిపిస్తుంది. ఈ లెక్కన 2018లో తొలి బ్లాక్ బస్టర్ అందుకుంటున్నది నాగశౌర్యే అన్నమాట.
2018 సంక్రాంతికి జై సింహా ఓకే అనిపించింది.. అజ్ఞాతవాసి అడ్రస్ గల్లంతయింది.. గ్యాంగ్ మెరవలేదు.. రంగుల రాట్నంకు అన్ని రంగులు కలిసి కనిపించాయి. ఇలాంటి టైమ్ లో వచ్చిన భాగమతి హిట్ అయింది. ఈ చిత్రానికి వసూళ్లు బాగానే వచ్చినా కూడా అమ్మిన రేట్ల ప్రకారం.. చేసిన బిజినెస్ ప్రకారం హిట్ అయింది కానీ బ్లాక్ బస్టర్ కాలేదు. 32 కోట్లు వచ్చినా కూడా 30 కోట్లకు అమ్మారు భాగమతిని. దాంతో హిట్ దగ్గరే ఆగి.. బ్లాక్ బస్టర్ కు దూరంగా జరిగింది. దాంతో ఛలో ఇప్పుడు ఆ బాధ్యత తీసుకుంది.
ఫిబ్రవరి 2న రవితేజ టచ్ చేసి చూడుతో పాటు వచ్చి ఆ సినిమాను పూర్తిగా డామినేట్ చేసి విన్నర్ గా నిలిచింది ఈ చిత్రం. ఇప్పటికే ఓవర్సీస్ లో 4 కోట్ల మార్క్ అందుకుని డబుల్ బ్లాక్ బస్టర్ అయింది ఛలో. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రం దూకుడు మామూలుగా లేదు. ఇప్పుడు ఛలోతో పాటు తొలిప్రేమ కూడా కుమ్మేసుకుంటుంది. ఈ చిత్రం తొలి వారాంతంలోనే ఈజీగా 9 కోట్ల మార్క్ అందుకునేలా కనిపిస్తుంది. అయితే ఇది బ్లాక్ బస్టర్ అవ్వాలంటే మాత్రం 35 కోట్ల మార్క్ అందుకోవాల్సిందే. మొత్తానికి చూడాలిక.. ఛలో.. తొలిప్రేమ కలెక్షన్ల జర్నీ ఎక్కడ ఆగనుందో..?