అసలే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మల్టీస్టారర్ ట్రెండ్ ఊపందుకుంది. ఇలాంటి టైమ్ లో ఏ కొత్త కథ దొరికినా కూడా మన హీరోలు కలిసి నటించ డానికి ఉత్సాహం చూపిస్తున్నారు. ఇప్పటికే నాగార్జునతో కలిసి నాని నటిస్తున్నాడు.. ఇక నితిన్ తో కలిసి శర్వానంద్ నటిస్తున్నాడు.. అలాగే వరుణ్ తేజ్ తో కలిసి వెంకటేశ్ నటించబోతున్నాడు. ఇలాంటి క్రేజీ కాంబినేషన్స్ ఇంకా సెట్స్ పైకి రాకముందే ఇప్పుడు నాగచైతన్య, రానా కలిసి నటించబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ కాంబినేషన్ ను కలపడానికి ట్రై చేస్తున్న దర్శకుడు ప్రవీణ్ సత్తార్. గతేడాది గరుడవేగతో సత్తా చూపించాడు ఈ దర్శకుడు. రాజశేఖర్ అనే ఓ హీరో ఉన్నాడనే విషయాన్ని ప్రేక్షకులకు గుర్తు చేసింది ఈ చిత్రం. కమర్షియల్ గా పెద్దగా ఆడకపోయినా కూడా ప్రవీణ్ కు దర్శకుడిగా మాత్రం చాలా పేరు తీసుకొచ్చింది గరుడవేగ. ఈ చిత్రం తర్వాత కచ్చితంగా తను భారీ సినిమాలను హ్యాండిల్ చేస్తాడనే నమ్మకం స్టార్స్ లో కలిగించాడు ప్రవీణ్. ఈ నమ్మకంతోనే ఇప్పుడు నాగచైతన్య, రానా ముందడుగేస్తున్నారని తెలుస్తుంది. ప్రవీణ్ చెప్పిన కథ ఒకటి బాగా నచ్చడంతో సై అనేసారని.. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తారని తెలుస్తుంది. ఇప్పటికే నాగచైతన్యతో సవ్య సాచి సినిమా నిర్మిస్తున్నారు మైత్రి సంస్థ. మొత్తానికి చూడాలి మరి.. బావ బామ్మర్దులు కలిసి నటిస్తే ఆ రచ్చ ఎలా ఉంటుందో..?