ఒకప్పుడు చెన్నైలో ఉన్న ఇండస్ట్రీని నానా తంటాలు.. కష్టాలు పడి హైదరాబాద్ కు మార్చారు. గత పాతికేళ్లుగా తెలుగు ఇండస్ట్రీ అంటే కేరాఫ్ భాగ్యనగరమే. ఇక్కడే అన్ని షూటింగులు.. ఈవెంట్లు.. ఆడియో వేడుకలు. హైదరాబాద్ ను మించిన ఆప్షన్ మరోటి లేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి దిగ్గజాలు తెలుగు ఇండస్ట్రీని భాగ్యనగరానికి తరలించడానికి చాలా శ్రమ పడ్డారు. ఏఎన్నార్ స్టూడియోలు నిర్మించి ఇండస్ట్రీని హైదరాబాద్ కు మార్చడానికి కృషి చేస్తే.. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు ఇండస్ట్రీకి బాగా హెల్ప్ అయ్యాయి. ఇక ఇప్పుడు రాష్ట్రాలు విడిపోయాయి. తెలుగు రాష్ట్రంగా ఉన్నది.. రాష్ట్రాలుగా మారిపోయాయి. ఇలాంటి టైమ్ లో మరోసారి ఇండస్ట్రీని తరలించే పనులు జోరందుకున్నాయనే ప్రచారం జరుగుతుంది.
తెలుగు ఇండస్ట్రీకి చిరునామాగా ఉన్న హైదరాబాద్ ను ఇప్పుడు ఏపీకి షిఫ్ట్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆడియో వేడుకలు, సక్సెస్ ఫంక్షన్ లు అన్నీ ఏపీలో చేసుకుంటున్నారు కొందరు హీరోలు. పైగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా సినిమా ఇండస్ట్రీని వైజాగ్ లో అభివృద్ది చేస్తానంటూ వాగ్ధానాలు చేస్తున్నారు. సినిమా వాళ్లకు కావాల్సినవన్నీ సమకూరుస్తామంటున్నారు. ఇక ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం తెలుగు ఇండస్ట్రీని నెత్తిన పెట్టుకుంటున్నాడు. అడిగినవన్నీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నాడు. ఈ మధ్య చాలా వేడుకలు ఏపీ లోనే జరిగాయి. అంతెందుకు తాజాగా హలో వేడుక కూడా అక్కడే చేసాడు నాగార్జున.
ఈ మధ్యే బాలయ్య జై సింహా ఆడియో వేడుక ఏపీలోనే జరిగింది. దానికి ముందు కూడా అమరావతిలోనూ అన్నీ చేస్తున్నాడు బాలయ్య. ఇక ఖైదీ నెం.150 ఆడియో వేడుక జరిగిన హాయ్ లాండ్ లో జరిగింది గతేడాది. ఇప్పుడు రంగస్థలం ప్రీ రిలీజ్ వేడుక కూడా వైజాగ్ లో జరుగుతుంది. మార్చ్ 18న ఈ వేడుక ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ తెలంగాణలో జరిగితే.. ఆడియో ఏపీలో జరుగుతుంది. రెండు రాష్ట్రాలను బాగానే పట్టించుకుంటున్నారు దర్శక నిర్మాతలు.
ఆంధ్రప్రదేశ్ కు ఇండస్ట్రీని మార్చేయాలనే ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ మన హీరోలు సైతం టాలీవుడ్ ని ఏపీకి బానే సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పటికే అక్కడ వెంకటేశ్ లాంటి హీరోలు స్టూడియోల నిర్మాణం.. ప్రభాస్, మహేశ్ లాంటి హీరోలు మల్టీప్లెక్స్ ల నిర్మాణం చేపట్టారు. మరోవైపు రామ్ చరణ్, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలు కూడా ఏపీలో స్టూడియోలు కట్టడానికి ఆలోచిస్తున్నారంటూ ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావ్ తెలిపారు. చూస్తుంటే తెలుగు ఇండస్ట్రీని కేరాఫ్ అమరావతి చేసే వరకు మన హీరోలు నిద్ర పోయేలా కనిపించట్లేదు. కానీ ఇండస్ట్రీని తరలించడం అంత ఈజీనా..?