చెప్పి కొట్టేస్తే రీమేక్.. చెప్పకుండా కొట్టేస్తే ఫ్రీమేక్. ఇప్పుడు బాలీవుడ్ రెండో దానికే ఎక్కువగా అలవాటు పడినట్లు కనిపిస్తుంది. వరసగా తెలుగులో వస్తున్న సినిమాలను చెప్పకుండా కొట్టేస్తున్నారు అక్కడి దర్శక నిర్మాతలు. ఆలోచిస్తే బుర్రలు హీట్ ఎక్కుతాయేమో అని.. ముందుగానే చెప్పకుండా కథలు లేపేస్తున్నారు. ఉన్నది ఉన్నట్లు తీస్తే తెలిసిపోతుందని.. దానికి వాళ్ల పైథ్యం కూడా జోడించి.. మంచి సినిమాలను చెడగొడుతున్నారు. కొన్నేళ్ల నుంచి తెలుగు సినిమాలకు హిందీలో డిమాండ్ పెరిగింది. ఓ సీజన్ లో వరసగా ఇక్కడి సినిమాలే అక్కడ ఎక్కువగా రీమేక్ అయ్యాయి. సాక్షాత్తు మునిగిపోతున్న సల్మాన్ కెరీర్ ను కాపాడింది కూడా మన పోకిరి సినిమానే. ఇక ఇప్పుడు కూడా మన సినిమాలను వరసగా దోచేస్తున్నారు వాళ్లు. తాజాగా విడుదలైన భాగీ 2 ట్రైలర్ చూస్తుంటే ఈ విషయం అర్థమైపోతుంది.
ఈ సినిమా క్షణం సినిమాకు కాపీ. ట్రైలర్ చూస్తుంటేనే ఈ విషయం అర్థమైపోతుంది. టైగర్ ష్రాఫ్, దిశాపటానీ జంటగా నటించిన ఈ చిత్రాన్ని అహ్మద్ ఖాన్ తెరకెక్కించాడు. సాజిద్ నడియావాలా నిర్మాత. ట్రైలర్ చూసిన తర్వాత కచ్చితంగా ఇది క్షణం సినిమాకు ఫ్రీమేక్ అని అర్థమైపోతుంది. కథ కొట్టేసి నపుడు కనీసం కనబడకుండా దాచుకోవడం కూడా తెలియట్లేదు పాపం బాలీవుడ్ వాళ్లకు. ట్రైలర్ లోనే కథంతా చూపించేసారు. ఎలాగూ టైగర్ ష్రాఫ్ ఉన్నాడు కదా.. యాక్షన్ పార్ట్ పెట్టకపోతే బాగుండదని దాన్ని యాక్షన్ బ్యాక్ డ్రాప్ యాడ్ చేసారు. ఈ హీరో చేసే సినిమాలన్నీ తెలుగు నుంచి అక్కడ దిగుమతి అయ్యే కథలే. పరుగు సినిమాను హీరోపంటిగా ఫ్రీమేక్ చేసి హిట్ కొట్టాడు. ఇక వర్షంను భాగీ అన్నాడు. ఇప్పుడు క్షణం సినిమాను భాగీ 2 అంటున్నాడు. మొత్తానికి పులి కళ్లన్నీ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీపైనే ఉన్నాయి. మరి చూడాలిక.. మన క్షణంను బాలీవుడ్ ఎలా రిసీవ్ చేసుకోనుందో. మార్చ్ 30న ఈ సినిమా విడుదల కానుంది.