ఒకప్పుడు శాటిలైట్ రైట్స్ అంటే నిర్మాతలు పెద్దగా పట్టించుకునే వాళ్లు కాదు. కొన్నేళ్ల కింది వరకు కూడా ఇది ఓ అదనపు బలం అంతే. చచ్చినోడి పెళ్లికి వచ్చిందే కట్నం అన్నట్లు.. ఎంత పడితే అంత ఇచ్చి ఛానెల్స్ సినిమాలను తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు శాటిలైట్ కూడా మరో బిజినెస్ అయింది. ఆ రోజుల్లో బడ్జెట్ లో పదో వంతు కూడా శాటిలైట్ రైట్స్ రూపంలో వచ్చేవి కావు. కానీ ఇప్పుడు బడ్జెట్ లో సగం అక్కడ్నుంచే వచ్చేస్తుంది. ఇంకొన్ని సినిమాలకు అయితే బడ్జెట్ మొత్తం శాటిలైట్ రైట్స్ నుంచే వస్తుంది. ఒక్కో సినిమా కోసం కోట్లకు కోట్లు పోస్తున్నారు టీవీ ఛానెల్స్. తమ ఛానెల్స్ టీఆర్పీ రేటింగ్స్ కోసం నిర్మాతల్ని కోట్లల్లో ముంచేస్తున్నారు. ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా శాటిలైట్ రైట్స్ రేట్స్ ను చూస్తుంటే కళ్ళు బైర్లు గమ్మక మానవు. గతేడాది ఖైదీ నెం. 150 శాటిలైట్ రైట్స్ ను మాటీవీ 12 కోట్లకు దక్కించుకుంది. కాటమరాయుడు రైట్స్ ను కూడా అదే ఛానెల్ 12.50 కోట్లకు సొంతం చేసుకుంది. అజ్ఞాతవాసి 24 కోట్లకు వెళ్లిందని సమాచారం. స్పైడర్ ను జి టీవీ ఏకంగా 26 కోట్లకు తీసుకుంది.
అంతెందుకు ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న రంగస్థలం రైట్స్ ను కూడా ఏకంగా 19 కోట్లకు ఓ ఛానెల్ దక్కించుకుంది. ఇక భరత్ అనే నేను శాటిలైట్ రైట్స్ కూడా 20 కోట్లకు చేరువగానే వెళ్లాయి. దానికి కొరటాల ట్రాక్ రికార్డ్ తో పాటు మహేశ్ ఉండనే ఉన్నాడు. ఇక నా పేరు సూర్య శాటిలైట్ సైతం ఆకాశ మంత ఎత్తులోనే జరిగింది. ఇప్పుడు బోయపాటి- రామ్ చరణ్ సినిమా ఎలా ఉంటుందో తెలియకుండానే 22 కోట్లకు ఓ ఛానెల్ ఈ చిత్ర హక్కులను దక్కించుకుంది. చరణ్ సినిమాల్లో ఇదే హైయ్యస్ట్ రేట్. ఈ సినిమా బడ్జెట్ లో 30 శాతం శాటిలైట్ నుంచే వచ్చాయి. ప్రతీ సినిమాకు రోజు రోజుకీ రేంజ్ పెంచేస్తున్నారే కానీ తగ్గించడం లేదు. మరోవైపు అమేజాన్ లాంటి సంస్థలు కూడా డిజిటల్ రైట్స్ ను కోట్లకు కోట్లు ఇచ్చి కొంటున్నారు. ఈ టైమ్ లోనూ శాటిలైట్ రైట్స్ తగ్గించట్లేదు.
ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలు.. పెద్ద సినిమాలు అని తేడా లేదు. క్రేజ్ ఉంటే చాలు కోట్లు ఇచ్చి మరీ నిర్మాతల్ని తడిపేస్తున్నారు. రెండేళ్లుగా ఈ రేట్స్ మరీ ఎక్కువైపోయాయి. బాహుబలి శాటిలైట్ రైట్స్ ని 14 కోట్లకు కొంటే.. హిందీలో బాహుబలి 2 రైట్స్ 52 కోట్లకు అమ్ముడయ్యాయి. మిగిలిన అన్ని భాషల్లో కలిపితే కేవలం శాటిలైట్ నుంచే బాహుబలి 2 ఖాతాలోకి 150 కోట్లకు పైగా వచ్చేసాయి. మిగిలిన హీరోలకు కూడా రేంజ్ ఇలాగే ఉంది. సినిమాను బట్టి రేట్ అన్నట్లు ఒక్కో సినిమా కోట్లకు కోట్లు పలుకుతుంది. సినిమా హిట్టు ఫ్లాపుతో పనిలేకుండా విడుదలకు ముందే పెద్ద సినిమాలకు శాటిలైట్ అయిపోతుంది. దాంతో నిర్మాతలు ఒడ్డున పడిపోతున్నారు. సర్దార్, బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్స్ ను కూడా భారీ రేట్ కు కొనేసాయి ఛానెల్స్. మొత్తానికి ఇప్పుడు శాటిలైట్ బిజినెస్ నిర్మాతలకు మూడు పువ్వులు ఆరు కాయల్లా మారిపోయింది.