మనకు తెలిసిన ఎవరో వ్యక్తి చనిపోతేనే అయ్యో పాపం అనుకుంటాం. అలాంటిది తెలుగు ఇండస్ట్రీలో 30 ఏళ్లుగా ఉంటూ.. 300 సినిమాలకు పైగా నటించిన సీనియర్ కమెడియన్ గుండు హనుమంతరావు కన్నుమూసాడు. స్టార్ హీరోలందరితోనూ నటించిన అనుభవం ఆయన సొంతం. పోనీ అతడు బ్రహ్మానందం రేంజ్ లో స్టార్ కమెడియన్ కాకపోవచ్చు కానీ కచ్చితంగా అందరికీ తెలిసిన కమెడియనే కదా..! మరి అలాంటి కమెడియన్ చనిపోయినపుడు అందర్నీ పిలిచి సంతాప సభ కూడా పెట్టరా అని అడుగుతున్నారు ప్రేక్షకులు. మాట్లాడితే మా.. మా ఇది చేస్తుంది అది చేస్తుంది అని చెబుతూ గొప్పలకు పోతుంటారు కదా.. ఇప్పుడు గుండు హనుమంతరావుకి చేసే మర్యాద ఇదేనా..? ఆయన చనిపోయినపుడు చూడ్డానికి ఎలాగూ ఏ స్టార్ హీరో కనీసం వచ్చిన పాపాన పోలేదు.. ఇక దర్శకుల మాటైతే దేవుడెరుగు.
చిన్నా చితకా వాళ్ల మధ్యే ఆయన అందరి మధ్య నుంచి వెళ్లిపోయాడు. మరి అలాంటి సీనియర్ కమెడియన్ ను కనీసం చనిపోయిన తర్వాత కూడా పట్టించుకోరా..? ఇవన్నీ పక్కనబెడితే ఆయన చనిపోయాడని తెలిసి కూడా విశ్వనాథ్ గారికి జన్మదిన శుభాకాంక్షలతో పాటు అవార్డ్ ప్రధానం చేసారు. కనీసం ఆయన గుండు కన్నుమూసిన తర్వాతైనా ఈ వేడుకను ఆపాలి కదా.. విశ్వనాథ్ గారికి చెప్పాలి కదా..? ఎవరూ అలా చేయలేదు. పోనీ అలా చేసారే అనుకుందాం.. కనీసం ఒక్కరైనా ఆ వేడుకలో గుండు హనుమంతరావు గురించి మాట్లాడాలి కదా..? ఇప్పుడైనా కనీసం పట్టించుకుని ఓ సంతాప సభ ఏర్పాటు చేస్తారా.. లేదంటే గతంలో ధర్మవరపు, ఎమ్మెస్ ఏవీఎస్ కు చేసినట్లే ఇప్పుడు తూతూ మంత్రంగా వదిలేస్తారా..? ఏమో చూడాలిక..!