నాని.. ఇప్పుడు ఈయన్ని హీరో కాదు.. హిట్ మిషన్ అంటున్నారు. అక్కడ క్రికెట్ లో కోహ్లీ రన్ మిషన్ అయినట్లు.. ఇక్కడ నాని హిట్ మిషన్. ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఎనిమిది వరస విజయాలు ఇచ్చాడు నాని. ఇది కలలో కూడా ఏ హీరోకు సాధ్యం కాని రికార్డ్. కానీ ఇది నాని చేసాడు.. చేసి చూపించాడు. మూడేళ్ల కింద 10 కోట్లు కూడా లేని నాని మార్కెట్.. ఇప్పుడు ఏకంగా 40 కోట్లకు చేరిపోయింది. ఒక్కోస సినిమాతో తన మార్కెట్ రేంజ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు న్యాచురల్ స్టార్. అప్పుడు ఆయన సినిమా బడ్జెట్ కూడా 10 కోట్ల లోపే ఉండేది. కానీ ఇప్పుడు అది కూడా 20 కోట్లకు పైగానే వెళ్లింది. బిజినెస్ కూడా 40 కోట్ల వరకు జరుగుతుంది.
రెండేళ్ల కింది వరకు నాని రెమ్యునరేషన్ గురించి ఎక్కడా మాటలు వినిపించలేదు. కానీ ఇప్పుడు మాత్రం బాగా వినిపిస్తున్నాయి. నేను లోకల్ ముందు వరకు కూడా 3 కోట్ల లోపు ఉన్న నాని రెమ్యునరేషన్ ఇప్పుడు డబుల్ అయింది. నేనులోకల్ తర్వాత నిన్నుకోరి కోసం 4 కోట్లపైనే తీసుకున్నాడని తెలుస్తోంది. ఇక ఎంసిఏ దిల్ రాజు కాబట్టి ఎంత తీసుకున్నాడో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు చేస్తోన్న కృష్ణార్జున యుద్ధంకు మాత్రం రైట్స్ తో పాటు లెక్క 8 కోట్లకు చేరిందని తెలుస్తుంది. దాంతోపాటు అశ్వినీదత్ నిర్మాణంలో నాగార్జునతో కలిసి చేయబోయే మల్టీస్టారర్ కు కూడా 8 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలొస్తున్నాయి.
ఇక మైత్రి మూవీ మేకర్స్ తో కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయడానికి ఏకంగా 9 కోట్లు అడిగాడని.. నాని సక్సెస్ స్ట్రీక్ చూసి అడిగినంతా ఇవ్వడానికి రెడీ అయ్యారని వార్తలొచ్చాయి. అయితే కథలో మార్పులు చేయమనడంతో నాని చేతుల్లోంచి సినిమా జారిపోయింది. ఇప్పుడు నాని రేంజ్ చూసి కచ్చితంగా స్టార్ హీరోలు కూడా కుళ్లుకోకుండా ఉండరు. ఏ సపోర్ట్ లేకుండా వచ్చి.. ఇండస్ట్రీలో నిలబడటమే గగనం అనుకుంటుంటే.. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోలకే పోటీగా ఎదిగాడు నాని. మరో రెండు హిట్లు పడితే నాని రేంజ్ ఊహించుకోవడం కూడా కష్టమైపోతుందేమో…? అంతేలెండి.. ఇండస్ట్రీలో టైమ్ నడిచినపుడే నడిపించుకోవాలి. ఇప్పుడు నాని ఇదే చేస్తున్నాడు.