శ్రీదేవి అంటే మనకు హీరోయిన్ గానే తెలుసు. ఓ నటిగా ఆమె ఎంత గొప్పో అర్థం చేసుకోవచ్చు. అది ఆమె నటనను చూస్తే అర్థమైపోతుంది. ఇక అందం అంటారా.. దానికి మరో పేరు కూడా పెట్టాల్సిన పనిలేదు. అతిలోకసుందరి అంటే ఎలా ఉంటుందో శ్రీదేవిని చూస్తే అర్థమైపోతుంది. మూడు తరాల నటులతో కలిసి నటించిన ఏకైక ఇండియన్ హీరోయిన్ శ్రీదేవి మాత్రమే. అయితే ఇవన్నీ ప్రపంచానికి తెలిసిన నిజాలే. కానీ ఆమె వెనక గతం కూడా చాలా లోతుగా ఉంది. శ్రీదేవి తమిళ అమ్మాయి. ఆమె తల్లి రాజేశ్వరి. ఆమె కూడా జూనియర్ ఆర్టిస్ట్. సినిమాల్లో హీరోయిన్ గా రాణించాలని శ్రీదేవి తల్లి రాజేశ్వరికి చాలా ఆశ. కానీ ఆమె ఆశ తీరలేదు. దాంతో కూతుర్నైనా పెద్ద హీరోయిన్ ని చేయాలని ఆశపడింది ఆమె. అన్నట్లుగానే నాలుగేళ్ల చిరు ప్రాయం నుంచే శ్రీదేవిని సినిమాల్లోకి పంపించింది వాళ్ల అమ్మగారు.
14 ఏళ్లకే హీరోయిన్ గా ఇండస్ట్రీకి వచ్చింది శ్రీదేవి. ఆ తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. శ్రీదేవి నిజ జీవితంలోనూ చాలా కష్టాలనే అనుభవించింది. ఆమె లమ్హె చిత్రం షూటింగ్ లో ఉన్నపుడు తండ్రి.. జుదాయి షూటింగ్ లో ఉన్నపుడు అమ్మను కోల్పోయింది. హిందు సాంప్రదాయం ప్రకారం పెద్ద కుమారుడు తల్లి చితికి నిప్పు అంటించాలి. కాని శ్రీదేవి కూతురు అయినప్పటికి.. తన తల్లి అంత్య క్రియలకు తానే చితికి నిప్పు అంటించింది. ఇక ఒంటరితనంలో ఉన్నపుడు ఆమె బాలీవుడ్ హీరో మిధున్ చక్రవర్తికి చేరువైందని.. అతన్ని పెళ్లి కూడా చేసుకుందనే వార్తలున్నాయి. కానీ ఇవి ఎంత వరకు నిజం అనేది ఇప్పటికీ తెలియదు.
కొన్ని కారణాల వల్ల బోనీకపూర్ ను పెళ్లి చేసుకుంది శ్రీదేవి. అప్పటికే ఆయనకు మోనీ కపూర్ తో పెళ్లైంది. వారికి ఇద్దరు సంతానం కూడా. అలాంటి సమయంలో బోనీని పెళ్లి చేసుకుంది శ్రీదేవి. వాళ్లకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బోనీకపూర్ ను 1996 జూన్ 2న పెళ్లి చేసుకునే సమయానికే శ్రీదేవి గర్భవతి. వారి వివాహం జరిగిన ఏడు నెలలకే ఝాన్వి పుట్టింది. మొత్తానికి తల్లి హీరోయిన్ గా నిలబడాలని ఆశించింది.. కానీ కుదర్లేదు. ఆ కోరికను తాను తీర్చి తల్లికి గొప్ప నివాళిని ఇచ్చింది శ్రీదేవి. అలాగే కేవలం తన పేరు ప్రఖ్యాలతోనే కుటుంబాన్ని కూడా చాలా రోజుల పాటు లీడ్ చేసింది ఈ మహానటి.