మన హీరోలకు ఎప్పుడూ సినిమాలే కాదు.. అప్పుడప్పుడు దేశం కూడా గుర్తొస్తుంటుంది. అయితే ఇప్పుడు కాస్త ఎక్కువగా గుర్తొచ్చిందంతే తేడా. అసలు విషయం ఏంటంటే.. ఇప్పుడు మన హీరోలంతా ఆర్మీ కథలపై పడ్డారు. ఎందుకో తెలియదు కానీ అందరికీ ఒకేసారి బోర్డర్ గుర్తుకొచ్చేసింది. గతేడాది బోర్డర్ 1971 అనే మళయాల సినిమాలో అల్లు శిరీష్ సైనికుడిగా నటించాడు. దానికి ముందు కంచెలో వరుణ్ తేజ్ నటించాడు. ఇకిప్పుడు స్టార్ హీరోలు ఈ బాధ్యతను తీసుకున్నారు. ఇప్పటికే నా పేరు సూర్య.. నా యిల్లు ఇండియాలో అల్లుఅర్జున్ సైనికుడిగా నటిస్తున్నాడు. నిజమైన ఆర్మీ ఆఫీసర్ ఎలా ఉంటాడో శిక్షణ తీసుకుని మరీ ఈ పాత్రకు సిద్ధమయ్యాడు బన్నీ. ఇక దర్శకుడు వక్కంతం వంశీ కూడా నిజంగా యుద్ధం జరిగిన ప్రదేశాలకు వెళ్లి నా పేరు సూర్య షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాడు. ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. మే 4న సినిమా విడుదల కానుంది. బన్నీతో పాటే ఇప్పుడు శర్వానంద్ కూడా ఆర్మీ ఆఫీసర్ గానే నటిస్తున్నాడు.
హను రాఘవపూడి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాడు శర్వా. ఇందులో తండ్రీ కొడుకులుగా నటిస్తున్నాడని తెలుస్తుంది. ఒకటి 20 ఏళ్ల పాత్రైతే.. మరొకటి 40 ప్లస్ రోల్. ఈ పాత్ర కోసం శర్వానంద్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. సాయిపల్లవి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. రొటీన్ సినిమాలు నటించడం ఇష్టం లేదని చెప్పిన సాయి.. శర్వా సినిమా కథలో చాలా మలుపులు ఉన్నాయంటుంది. ఇక ఇప్పుడు కొత్తగా ఆర్మీలో జాయిన్ అయ్యాడు ఎన్టీఆర్. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఈయన సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో యంగ్ టైగర్ ఆర్మీ ఆఫీ సర్ గా నటించబోతున్నాడని.. అందుకే కొన్ని నెలలుగా ఫుల్ డైట్ లో ఉంటూ పాత్ర కోసం ఫిజిక్ కూడా మార్చుకుంటున్నాడని తెలుస్తుంది. ఈ కథ ఎన్టీఆర్ మనసుకు బాగా నచ్చిందని చెబుతున్నాడు త్రివిక్రమ్. మార్చ్ 23 నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది. మొత్తానికి చూడాలిక.. ఈ దేశ సేవకులంతా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారో..?