వైఎస్ రాజశేఖర్ రెడ్డి.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ముఖ్యమంత్రిగా తెలుగు రాష్ట్రాన్ని అద్భుతమైన ప్రగతి వైపు అడుగేసేలా చేసిన జన నాయకుడు. రాజకీయ నాయకుడు అన్న తర్వాత పాజిటివ్స్ తో పాటు నెగిటివ్స్ కూడా ఉంటాయి. రాజశేఖర్ రెడ్డిపై కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి.. చాలా అలిగేషన్స్ ఉన్నాయి కానీ చనిపోయిన వ్యక్తి గురించి ఇప్పుడు అవన్నీ మాట్లాడటం సరికాదు. ఆయనకు ప్రజల గుండెల్లో అంతులేని అభిమానం అయితే ఉంది. ఈయన చనిపోయి 9 ఏళ్లవుతున్నా ఇప్పటి వరకు ఈయన జీవితంపై బయోపిక్ రాలేదు. అప్పట్లో పూరీ జగన్నాథ్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే సినిమా మొదలుపెట్టాడు. రాజశేఖర్ ఇందులో హీరోగా నటించాలని ఫిక్సయ్యాడు. కానీ తర్వాత అనుకోకుండా ఇది ఆగిపోయింది. మళ్లీ ఇన్నేళ్లకు వైఎస్ఆర్ బయోపిక్ తెరపైకి వచ్చింది. ఈ సారి కూడా కన్ఫర్మ్ అంటున్నారు. గతేడాది ఆనందో బ్రహ్మ లాంటి సినిమాతో నవ్వించిన మహిత్ రాఘవ వైఎస్ఆర్ బయోపిక్ బాధ్యత తీసుకుంటున్నాడు. హీరో ఎవరో తెలుసా.. మళయాల మెగాస్టార్ మమ్ముట్టి. ప్రస్తుతం ఈ చిత్ర స్క్రిప్ట్ వర్క్ నడుస్తుంది. ఇప్పటికే ఈ కథ మమ్ముట్టికి చెప్పడం.. ఆయన మూడు భాషల్లో నటించడానికి ఒప్పుకోవడం కూడా జరిగిపోయాయి. వైఎస్ఆర్ బయోపిక్ కు యాత్ర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్ర అతని జీవిత అంతరంగం గురించి ఈ సినిమాలో ప్రదానంగా చూపించబోతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి మరి చూడాలిక.. వైఎస్ఆర్ బయోపిక్ ఎలా ఉండబోతుందో..?