మనకు తెలిసిన వాళ్లు ఎవరైనా చనిపోతేనే అయ్యో పాపం అంటూ వాళ్ల ఇంటికి వెళ్లి ఓదార్చి వస్తాం. అలాంటిది దేశం అంతా తెలిసిన ఓ లెజెండ్ కన్నుమూస్తే.. అందులో ఆమెకు తెలుగు ఇండస్ట్రీతో ఎనలేని అనుబంధం ఉంటే.. అప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి..? ఆమె మరణాన్ని ఇండస్ట్రీ ఎంత బాధగా ఫీల్ అవ్వాలి..? శ్రీదేవి మరణంతో అదే జరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ తెలుగు ఇండస్ట్రీ శ్రీదేవిని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఈమె మరణం ఇక్కడి వాళ్ల మనసులను పెద్దగా కదిలించినట్లు అనిపించట్లేదు. అదేంటి శ్రీదేవి చనిపోయినపుడు చిరుతో పాటు నాగార్జున, వెంకటేశ్ లాంటి వాళ్లు వెళ్లొచ్చారు కదా అనుకుంటున్నారా..? ఆ హీరోలంతా ఆమెతో కలిసి నటించారు ప్లస్ బోనీకపూర్ తో ఉన్న పరిచయాల కారణంగా శ్రీదేవి కడసారి చూపులకు వెళ్లారు. కానీ మిగిలిన ఇండస్ట్రీ అంతా ఇక్కడే ఉంది.
అంతా ముంబై వెళ్లి చూడాల్సిన పనిలేదు. ఎవరి పనులు వాళ్లకు ఉంటాయి. అది తప్పనడం లేదు. వాళ్లను తప్పు పట్టడం లేదు కూడా. కానీ శ్రీదేవి లాంటి లెజెండ్ చనిపోయినపుడు కచ్చితంగా తెలుగు ఇండస్ట్రీ తమదైన సంతాపం తెలపాల్సి ఉంది. ఎందుకంటే ఇక్కడ ఆమె దాదాపు 80 చిత్రాల్లో నటించింది. ఎన్టీఆర్ నుంచి మొదలుపెట్టి ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు, చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్ లాంటి స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడింది. అలాంటి హీరోయిన్ చనిపోయినపుడు కచ్చితంగా ఓ సంతాప సభ అయినా ఏర్పాటు చేయాల్సిందంటున్నారు అభిమానులు. అలా చేయకపోవడం నిజంగా శ్రీదేవి అభిమానులను బాధ పెడుతుంది. టిఎస్సార్ ఏర్పాటు చేసినా అది ఆయన సొంతంగా చేసుకున్నదే. ఇండస్ట్రీతో ఈ సంతాప సభకు సంబంధం లేదు.
శ్రీదేవితో అనుబంధం ఉన్న వాళ్లంతా టిఎస్ఆర్ సభకు వచ్చారు. కానీ ఇండస్ట్రీ నుంచి మాత్రం ఇప్పటి వరకు అఫీషియల్ గా సంతాప సభ ఏర్పాటు చేయలేదు. అంటే శ్రీదేవికి అంత విలువ లేదనా.. లేదంటే ఆమెకు అవసరం లేదనా..? ఇక్కడి నుంచి ముంబైకి వెళ్లిపోతే శ్రీదేవి తెలుగు హీరోయిన్ కాకుండా పోతుందా..? గతంలో ఏఎన్నార్, రామానయుడు, దాసరి లాంటి పెద్దలు పోయినపుడు రోజుల తరబడి సంతాప సభలు పెట్టిన వాళ్లకు ఇప్పుడు శ్రీదేవి ఎందుకు కనిపించట్లేదు. ఈ విషయంపై ఇండస్ట్రీ పెద్దలు కూడా ఏమీ మాట్లాడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. లేదంటే శ్రీదేవిని కూడా ఎమ్మెస్ నారాయణ, ఆహుతి ప్రసాద్, గుండు హనుమంతరావ్ లాంటి కమెడియన్ల సరసన చేర్చేసి.. చేతులు దులిపేసుకుంటున్నారా..? ఏమో మరి.. ఇండస్ట్రీ శ్రీదేవి పట్ల చూపిస్తున్న తీరు మాత్రం కచ్చితంగా హర్షనీయం కాదు. మరి ఇప్పటికైనా మన మా మేల్కొంటుందో లేదో చూడాలిక..?