పైకి సాఫ్ట్ గా ఉన్నాడు.. సినిమాలు మాత్రం పట్టించుకుని మిగిలినవి వదిలేస్తాడు.. రాజకీయాల జోలికి అస్సలు వెళ్లడు.. అనుకుంటున్నారేమో..? ఏదో కారెక్టర్ కొత్తగా ఉందని డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లోకి వచ్చాడు. లోపల మాత్రం ఒరిజినల్ అలాగే ఉంది. వాడు బయటికి వస్తే రచ్చ రచ్చే. కొరటాల కోసం మనం కాస్త మార్చుకుని రాసుకున్న డైలాగ్ ఇది. ఎందుకంటే ఇదే డైలాగ్ ను బృందావనంలో ఎన్టీఆర్ కు రాసాడు ఈ దర్శకుడు. ఇప్పుడు ఈ డైలాగే కొరటాలకు సూట్ అవుతుంది. పైకి చూడ్డానికి అమయాకంగా కనిపిస్తాడు కానీ లోపల మాత్రం చాలా పెద్ద ముదురు కొరటాల శివ. ఈయన సినిమాలే ఈ విషయాన్ని చెబుతాయి. ఇప్పుడు మరోసారి తన పెన్ పవర్ ఏంటో చూపించాడు ఈ దర్శకుడు. ఇప్పటికే ఈయన విడుదల చేసిన భరత్ అనే నేను టీజర్ లోని ఓ డైలాగ్ మన రాజకీయ నాయకులకు బాగా తగిలేసింది.
ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోతే మనిషే కాదని మా అమ్మ చెప్పిందంటూ ఓ డైలాగ్ రాసాడు ఈ దర్శకుడు. ఇదే ఇప్పుడు మన రాజకీయ నాయకులకు సూటిగా తగులుతుంది. ఇక ఇప్పుడు మరో పొలిటికల్ పంచ్ తో దుమ్ము లేపాడు కొరటాల ఈ సారి ఏకంగా ప్రధాని నరేంద్రమోదీనే టార్గెట్ చేసాడు ఈ దర్శకుడు. మనమంతా మరొక్కసారి ప్రధాని నరేంద్రమోదీ గారికి ఆయన ఇచ్చిన మాట గుర్తు చేద్దాం అంటూ ట్వీట్ చేసాడు కొరటాల శివ. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ను నిజంగానే మీరు భారతదేశంలో భాగంగా భావిస్తున్నారా సర్ అంటూ మరో ట్వీటేసాడు కొరటాల. ఈ రెండు ట్వీట్స్ అర్థం ఏంటంటే.. ఏపిని నిలువునా కేంద్రం ముంచేస్తుందని. మరోవైపు బిజేపితో తెలుగుదేశం తాడేపేడో తేల్చుకుంటున్న తరుణంలో కొరటాల చేసిన ఈ ట్వీట్స్ రాజకీయ పరంగానూ వేడిని పుట్టిస్తున్నాయి. మొత్తానికి భరత్ అనే నేను మూడ్ లోనే ఉన్న కొరటాల.. ఇంకెన్ని ట్వీట్స్ చేసి సంచలనం సృష్టిస్తాడో..?