ప్రభుదేవా.. ఈయనలో ఓ అపరిచితుడు ఉన్నాడు. కమల్ దశావతారం కంటే దారుణంగా అవసరమైనపుడల్లా ఒక్కొక్కరిని బయటికి తీసుకొస్తుంటాడు ప్రభుదేవా. డాన్సర్ గా ఇండస్ట్రీకి వచ్చాడు.. కొరియోగ్రఫర్ గా మారాడు.. నటుడిగా ఎదిగాడు.. దర్శకుడిగా టర్న్ తీసుకున్నాడు.. ఇప్పుడు మళ్లీ హీరోగా బిజీ అవుతున్నాడు. ఓ మనిషిలో ఇన్ని కోణాలు చూడటం కష్టమే. కానీ అన్నీ చూపించాడు ప్రభుదేవా. 90ల్లో ప్రేమికుడు.. మిస్టర్ రోమియో లాంటి చాలా సినిమాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు ప్రభు. ఆ తర్వాత కొరియోగ్రఫర్ గా నెంబర్ వన్ అయ్యాడు. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాతో దర్శకుడు అయ్యాడు. అది హిట్ అవ్వడంతో 8 ఏళ్లు వరసగా దర్శకత్వమే చేసాడు. నటనకు పూర్తిగా సెలవు ఇచ్చేసాడు. కానీ కొన్నేళ్లుగా ఈయన దర్శకుడిగా సూపర్ ఫ్లాప్ అవుతున్నాడు. 2012లో వచ్చిన రౌడీరాథోర్ తర్వాత ఒక్క సినిమా కూడా ఆడలేదు. రాంబో రాజ్ కుమార్, యాక్షన్ జాక్సన్, రామయ్యా వస్తావయ్యా, సింగ్ ఈజ్ బ్లింగ్ సినిమాలు ఇలా వచ్చి అలా వెళ్లిపోయాయి. దాంతో ఇప్పుడు ఏ హీరో ఈయన్ని నమ్మ పరిస్థితుల్లో కూడా లేరు. దాంతో మళ్లీ తనకు కలిసొచ్చిన నటన వైపు అడుగేసాడు ప్రభుదేవా. మూడేళ్లుగా మరే పని పెట్టుకోకుండా కేవలం హీరోగానే బిజీగా ఉన్నాడు ఈ మల్టీటాలెంటెడ్. తమిళనాట అభినేత్రిలో తమన్నాతో రొమాన్స్ చేసిన ప్రభు.. ఈ మధ్యే హన్సికతో గుళేభకావళి అన్నాడు. ఇప్పుడు కార్తిక్ సుబ్బరాజ్ తో మెర్క్యూరి.. ఏఎల్ విజయ్ తో లక్ష్మీ.. చక్రితోలేటీతో కామోషీ.. ఇలా వరసగా సినిమాలతో బిజీ అయిపోయాడు. ఈయన తీరు జోరు చూస్తుంటే ఇకపై దర్శకుడిగా చూసే అవకాశమే లేనట్లుంది.