నెల గ్యాప్ లో రెండు సినిమాలు.. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాలు.. అంటూ రజినీకాంత్ అభిమానులు తెగ కలలు కనేసారు. ఎప్రిల్లో 2.0 వస్తుంది.. ఆ వెంటనే జూన్ లో కాలా వచ్చేస్తుందంటూ ఆ మధ్య తెగ కబుర్లు చెప్పారు దర్శక నిర్మాతలు. కానీ అనుకున్నది జరిగితే అది రజినీ సినిమా ఎందుకు అవుతుంది..? ఇప్పుడు 2.0 వెనక్కి వెళ్లిపోయింది. ఎప్పుడు వస్తుందో.. ఎప్పటికి పూర్తవుతుందో తెలియనంత కన్ఫ్యూజన్ లోకి వెళ్లిపోయింది ఈ చిత్రం. ఇక మిగిలిన కాలా ఎప్రిల్ 27 అని డేట్ ఫిక్సయింది. కానీ ఇప్పుడు ఈ సినిమాకు కూడా తిప్పలు తప్పేలా లేవు. మార్చ్ 16 నుంచి తమిళ ఇండస్ట్రీ బంద్ కు పిలుపునిచ్చాడు విశాల్. తమిళ ఇండస్ట్రీ బాగు కోసం నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ తీసుకున్న అంతా ఓకే అంటున్నారు.
అంటే మార్చ్ 16 నుంచి తమిళ ఇండస్ట్రీలో థియేటర్స్ కానీ.. డబ్బింగ్ స్టూడియోలు కానీ.. విఎఫ్ఎక్స్ వర్కులు కానీ ఏవీ జరిగే అవకాశం లేదు. అంటే విడుదలకు సిద్ధమైన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్ వర్కులు కూడా ఆగిపోక తప్పదు. ఇప్పుడు బంద్ తీవ్రత చూస్తుంటే ఇప్పట్లో ఆగేలా కూడా కనిపించట్లేదు. క్యూబ్ తో తాడోపేడో తేల్చుకునే వరకు విశాల్ కూడా వెనక్కి తిరిగేలా లేడు. దాంతో ఇప్పుడు విడుదలకు సిద్ధమైన సినిమాల దర్శక నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాలా కూడా ఇందులో ఉంది. ఎప్రిల్ 27న ఈ సినిమా విడుదల కానుంది. అంటే మరో నెల రోజుల పైనే ఉంది సమయం. అప్పటి వరకు బంద్ ప్రశాంతంగా ముగిస్తే మంచిది.. లేదంటే మాత్రం మరోసారి రజినీ అభిమానులకు నిరాశ తప్పదు. చూడాలిక.. చివరివరకు ఏం జరుగుతుందో..?