అవును.. ఇప్పుడు ఇదే జరుగుతుంది. ఒక్కోసారి అవకాశాలు ఎక్కువైనా కూడా ఇదే జరుగుతుంది. ఇప్పుడు బోయపాటి శీను విషయంలో ఇదే జరుగుతుంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలు ఈయనకు ఆఫర్లు ఇచ్చారు ఇదే ఇప్పుడు బోయపాటిని టెన్షన్ పెడుతుంది. మనోడికి ఒక్కో సినిమాకు కేవలం ఆర్నెళ్లు మాత్రమే టైమ్ ఉంది. ఈయన కెరీర్ మొదలుపెట్టి 12 ఏళ్లైంది. ఇన్నేళ్ల గ్యాప్ లో చేసింది ఏడు సినిమాలే. అంటే సగటున రెండేళ్లకో సినిమా చేసాడు. ఏడాదికి ఓ సినిమా చేయడం అనేది బోయపాటికి తెలియని పని. అలాంటి దర్శకుడికి అదిరిపోయే ట్విస్ట్ వచ్చింది. ఈయన కోసం ఇద్దరు స్టార్ హీరోలు రెడీగా ఉన్నారిప్పుడు. కానీ ఆర్నెళ్లకో సినిమా పూర్తి చేయాలి.. మరో ఆప్షన్ లేదక్కడ. ఇప్పుడు నిజంగా ఇది పూర్తి చేస్తాడా అనేది మాత్రం కచ్చితంగా ఆసక్తికరంగా మారింది.
బోయపాటి ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాతో బిజీగా ఉన్నాడు. త్వరలోనే రెండో షెడ్యూల్ పూర్తి కానుంది. డివివి దానయ్య దీనికి నిర్మాత. ఇందులో కైరాఅద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇదిలా ఉంటే 2018, జూన్ 10న బాలయ్య-బోయపాటి సినిమా ఓపెనింగ్ జరగనుంది. ఆ రోజు బాలయ్య పుట్టినరోజు. షూటింగ్ మాత్రం ఆగస్ట్ నుంచి జరగనుంది. అంటే ఆగస్ట్ లోపు రామ్ చరణ్ సినిమా పూర్తి చేయాలి. పైగా అతడు కూడా అక్టోబర్ నుంచి రాజమౌళి సినిమా చేయనున్నాడు. మరోవైపు బాలయ్యతో బోయపాటి చేయబోయే సినిమా 2019 మార్చ్ లోపు పూర్తవ్వాలి. ఎందుకంటే ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఈ చిత్రం కీలకం కాబట్టి.. ఎన్నికల ముందే విడుదలవ్వాలి కాబట్టి. ఈ గ్యాప్ లో బాలయ్య-తేజ సినిమా కూడా పూర్తి చేయాల్సి ఉంది. అంటే ఎటు చూసుకున్నా.. ఈ రెండు సినిమాలకు మధ్య గ్యాప్ ఆర్నెళ్లే. మరి బోయపాటి ఏం చేస్తాడో..?