అదేంటి.. అంత మాట అనేసారు. మన హీరోలకు ఏమైంది.. ఒక్కొక్కరు చాలా బాగున్నారు కదా అనుకుంటున్నారా..? అవును.. నిజమే అంతా బాగున్నారు కానీ.. రోగం మాత్రం వచ్చింది. అయితే అది బయట మాత్రం కాదు. సినిమాల్లో.. అవును.. ఈ మధ్య మన హీరోలు ఒప్పుకుంటున్న కథలు చాలా బాగుంటున్నాయి. ఒకప్పుడు హీరోకు ఏ సమస్య వచ్చినా మన హీరోలకు నచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఎలా ఉన్నా ఓకే కథ బాగుంటే చాలు అంటున్నారు. అందుకే రాజా ది గ్రేట్ లో రవితేజ అంధుడు అయ్యాడు.. అంధగాడులోనూ రాజ్ తరుణ్ గుడ్డివాడుగా మారాడు. ఇక ఆ మధ్య ఊపిరిలో నాగార్జున కాళ్లు లేకపోయినా ప్రేక్షకులు చూసారు. ఇప్పుడు రంగస్థలంలో రామ్ చరణ్ కు చెవులు వినిపించట్లేదు. గతేడాది విడుదలైన జై లవకుశలో ఎన్టీఆర్ కు నత్తి ఉంటుంది. ఇప్పుడు కథ బాగుంటే కథలో హీరో ఎలా ఉన్నా పర్లేదు అంటున్నారు హీరోలు. డిసీజ్ ఉన్నా కూడా చెప్పే పద్దతిలో చెప్తే సినిమా హిట్ అవుతుందని నమ్ముతున్నారు. ఇప్పుడు నారా రోహిత్ కూడా ఇదే చేస్తున్నాడు. ఈయన తాజాగా సినిమా శబ్ధంలో మూగవాడిగా నటిస్తున్నాడు రోహిత్. ఉగాది కానుకగా ఈ చిత్రానికి ముహూర్తం పెట్టారు దర్శక నిర్మాతలు. కొత్త దర్శకుడు మంజునాథ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుందని చెబుతున్నారు. ఇదే ఏడాది సినిమా విడుదల కానుంది. ఇన్నాళ్లూ తమిళ హీరోలు మాత్రమే ప్రయోగాలు చేస్తారు అనుకుంటే.. ఇప్పుడు తెలుగులోనూ ఈ ట్రెండ్ మొదలైంది.