రజినీకాంత్ సినిమా అంటేనే అదో రకం తెలియని వైబ్రేషన్. ఆయన వస్తున్నాడంటే తెలియకుండానే అభిమానుల్లో కరెంట్ పాస్ అవుతుంది. తెరపై ఆయన్ని చూస్తుంటే మనకే తెలియని ఓ జోష్ నెత్తురులో పాకిపోతుంది. ఇప్పుడు కాలాతోనూ ఇదే చేస్తున్నాడు రజినీ. వయసు 70కి చేరువలో ఉన్నా ఇప్పటికీ జోరు తగ్గలేదు. స్టైల్ లో తనను మించిన వాళ్లు ఈ ప్రపంచంలో లేరు అని మరోసారి నిరూపించాడు సూపర్ స్టార్. కాలా టీజర్ లో రజినీ మేనరిజమ్స్.. డైలాగులు అన్నీ పిచ్చెక్కించాయి. ముఖ్యంగా పూర్తి రౌడీయిజం ఇంకా చూడలేదు కదా.. ఇప్పుడు చూపిస్తానంటూ రజినీ చెప్పిన డైలాగ్ టీజర్ కే హైలైట్. ఇక పందులే గుంపుగా వస్తాయి అని శివాజీలో చెబితే ఇక్కడ వీరయ్య కొడుకునురా ఒక్కన్నే వచ్చా.. ఎంతమంది వస్తారో రండ్రా అంటూ మరోసారి తన స్టైల్ లో ఓ మాస్ డైలాగ్ పేల్చాడు రజినీకాంత్. ఈ టీజర్ విడుదలకు ముందు ఎందుకో కానీ కాలాపై కాస్త తక్కువ అంచనాలుండేవి. కానీ ఇప్పుడు అవి ఆకాశమంత ఎత్తుకు చేరిపోయాయి.
ఇప్పుడు ఇదే అంచనాలు బిజినెస్ గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ 160 కోట్లకు పైగానే జరుగుతుంది. ఇక ఇప్పుడు శాటిలైట్ లోనూ రప్ఫాడిస్తున్నాడు రజినీ. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కలిపి ఏకంగా 75 కోట్లకు ఈ డీల్ తెగ్గొట్టారని తెలుస్తుంది. స్టార్ గ్రూప్ మూడు భాషల్లో కలిపి ఇంత భారీ మొత్తం ఇచ్చి తీసుకుంది. దాంతో ధనుష్ పండగ చేసుకుంటున్నాడు. మామయ్యతో నిర్మించిన తొలి సినిమాతోనే రిలీజ్ కు ముందే కోట్లు వెనకేసుకుంటున్నాడు ధనుష్. ఎప్రిల్ 27న విడుదల కానుంది కాలా. కబాలి తర్వాత మరోసారి రంజిత్ దర్శకత్వంలో నటించిన సినిమా ఇది. నానా పటేకర్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. మరి చూడాలిక.. కాలా కరికాలన్ గా రజినీ రచ్చ ఎలా ఉండబోతుందో..?