నాగశౌర్య.. ఈ పేరుకు మొన్నటి వరకు ఉన్న ఇమేజ్ వేరు.. ఇప్పుడు ఉన్న ఇమేజ్ వేరు. ఒక్క సినిమాతో ఇండస్ట్రీలో లెక్కలు మారిపోతుంటాయి. ఇప్పుడు నాగశౌర్య విషయంలోనూ ఇదే జరిగింది. ఈయన ఛలో సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. 2018లో వచ్చిన వన్ అండ్ ఓన్లీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఇదే. ఈ సినిమా తర్వాత నాగశౌర్య మార్కెట్ కూడా బాగానే పెరిగిపోయింది. ప్రస్తుతం కణంతో పాటు అమ్మమ్మగారిల్లు సినిమాలతో రానున్నాడు ఈ కుర్ర హీరో. దాంతో పాటు ఈ మధ్యే సొంత బ్యానర్ లో నర్తనశాల సినిమాను మొదలుపెట్టాడు శౌర్య. ఈ సినిమాతో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడు పరిచయం కానున్నాడు. ఈ మూడు సినిమాలతో పాటు తాజాగా మరో సినిమా కూడా శౌర్య చెంతకు చేరినట్లు తెలుస్తుంది. మజ్ను ఫేమ్ విరించివర్మ ఈ మధ్యే శౌర్యకు ఓ కథ చెప్పాడని.. ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ నిర్మించడానికి రెడీ అయిందని తెలుస్తుంది. అయితే ఈ చిత్రం కోసం ఏకంగా 4 కోట్ల పారితోషికం శౌర్య అడిగేసరికి నిర్మాతకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్క హిట్ తోనే నాలుగు కోట్లు పారితోషికం అంటే కష్టమే. ఎందుకంటే శౌర్య సినిమాల్లో ఇప్పటి వరకు ఛలో మాత్రమే 12 కోట్ల మార్క్ అందుకుంది. దాని బడ్జెట్ 6 కోట్లే. కానీ ఇప్పుడు హీరోకే 4 కోట్లిస్తే బడ్జెట్ 10 కోట్లవుతుంది. అంటే కచ్చితంగా 15 కోట్లు వసూలు చేయాలి సినిమా. ఇదంతా వర్కవుట్ అవుతుందా..? ఎక్కడ చిన్న తేడా కొట్టినా కూడా నిర్మాతలకు నష్టాలు తప్పవు. అందుకే రెమ్యునరేషన్ విషయంలో శౌర్య కాస్త తగ్గితే బెటర్ అని సూచనలు వెళ్తున్నాయి ఆయనకు. మరి వీటిని నాగశౌర్య పట్టించుకుంటాడో లేదంటే గాలి వచ్చినపుడే కదా తూర్పు పట్టుకోవాలి అంటూ రెచ్చిపోతాడో చూడాలిక..!