బిచ్చగాడు అంటే ఇదివరకు ఫీల్ అయ్యే వాళ్లేమో కానీ ఇప్పుడు కాదు. ఈ బిచ్చగాడే రెండేళ్ల కింద తెలుగు ఇండస్ట్రీని కోటీశ్వరుడిగా మారాడు. ఈ పేరు వింటే తెలియకుండానే గుర్తొచ్చే హీరో విజయ్ ఆంటోనీ. ఈయన నటించిన బిచ్చగాడు ఇప్పటికీ తెలుగులో సంచలనమే. పబ్లిసిటీ లేకుండా మౌత్ పబ్లిసిటీతో ఈ సినిమా చేసిన రచ్చ చెప్పుకుంటే చరిత్రే.
ఈ ఒక్క సినిమా ఇచ్చిన ఉత్సాహంలో ఇప్పటికీ తెలుగు ఇండస్ట్రీని వదలడం లేదు విజయ్ ఆంటోనీ. అబ్బో.. ఈ అరవోళ్లు ఉన్నారు చూడండి.. మహా ముదుర్లండీ బాబూ..! మన హీరోలు తమిళనాడు వెళ్లి అక్కడ తమ సినిమాలు విడుదల చేయడం ఈ మధ్యే నేర్చుకున్నారు.
సినిమాలు ఫ్లాపైతే.. నెక్ట్స్ టైమ్ కనీసం ట్రై కూడా చేయట్లేదు. కానీ తమిళ హీరోలు మాత్రం ఆ టైప్ కాదండీ బాబూ..! చూడండి.. మీరు చూడాలి.. మీరు చూస్తూనే ఉండాలి.. చూడకపోతే ఊరుకోం.. అంటూ మనల్ని హిప్నటైజ్ చేసి పారేస్తున్నారు. ఇక ఒక్క సినిమా గనక అనుకోకుండా హిట్టైదంటే చాలు.. వరసగా డబ్బింగ్ సినిమాలతో దండయాత్ర చేస్తారు.
బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ కూడా ఇదే చేస్తున్నాడు. తమిళ్ లో మంచి ఇమేజ్ ఉన్నా.. తెలుగులో మాత్రం విజయ్ ఆంటోనికి పెద్దగా గుర్తింపు లేదు. బిచ్చగాడు తర్వాత విజయ్ ఆంటోనీ సినిమాలపై మన ప్రేక్షకులకు ఆసక్తి పెరిగింది.
ఆ సినిమా హిట్టవ్వడంతో వరసగా తన సినిమాలన్ని దించేస్తున్నాడు. బేతాళుడు.. ఇంద్రసేన.. యమన్.. ఇలా వరసగా చాలా సినిమాలు విడుదల చేసాడు విజయ్. కానీ ఇందులో ఏ ఒక్క సినిమా కూడా కనీస ఓపెనింగ్స్ తెచ్చుకోలేదు. ఇక ఇప్పుడు మరోసారి కాశీ అంటూ వస్తున్నాడు విజయ్ ఆంటోనీ.
తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదలైంది. ఇది కూడా కొత్తకథే. కానీ ఎంతవరకు మనోళ్లకు కనెక్ట్ అవుతుందని తెలియదు. త్వరలోనే సినిమా విడుదల కానుంది. మరి చూడాలిక.. ఈ చిత్రంతోనైనా విజయ్ ఆంటోనీ తెలుగులో హిట్ కొడతాడో లేదో..?